టీమ్‌ఇండియాకు(TEAM INDIA) శుభవార్త! కోహ్లీసేనకు(KOHLI) రెండు సన్నాహక మ్యాచులు ఏర్పాటు చేసేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అంగీకరించింది. త్వరలోనే తేదీలను నిర్ణయించనుంది. బీసీసీఐ(BCCI) విజ్ఞప్తి మేరకు రెండు కౌంటీ జట్లతో మ్యాచులు ఏర్పాటు చేసేందుకు ఈసీబీ ముందుకొచ్చింది.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(Workd Test Championship) ఫైనల్, ఇంగ్లాండ్ సిరీసుకు మధ్య టీమ్‌ఇండియాకు ఆరు వారాల సమయం ఉంది. సుదీర్ఘ కాలం బయో బుడగలో ఉండటం వల్ల ఆటగాళ్లు మానసికంగా అలసిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వారికి మూడు వారాల పాటు విరామం ప్రకటించారు. దాంతో వారంతా కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. స్నేహితులు, బంధువులతో సమయాన్ని గడుపుతున్నారు.
మొదట సన్నాహక మ్యాచులేమీ లేకపోవడం వల్ల విరామం ముగిశాక దుర్హమ్‌లో కోహ్లీసేనకు సాధనా శిబిరం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అంగీకరించిన కారణంగా ఆటగాళ్లను ముందుగానే అక్కడికి రావాలని ఆదేశించారు. దుర్హమ్‌లో అంతా కలుసుకున్నాక చెస్టరీ లీ స్ట్రీట్, కౌంటీ దుర్హమ్‌లో రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఉంటాయి. ముందు నాలుగు రోజులు, తర్వాత మూడు రోజుల మ్యాచులు ఆడతారు. తలపడబోయే కౌంటీ జట్ల వివరాలు ఇంకా తెలియలేదు.
"మేం కొవిడ్-19 నిబంధనలను అనుసరించి పనిచేయబోతున్నాం. ఈ విషయంపై మున్ముందు మరింత సమాచారం ఇస్తాం. భారత జట్టు జులై 15న దుర్హమ్ ప్రీటెస్టు శిబిరంలో రిపోర్టు చేస్తుంది. ఆగస్టు 1న ట్రెంట్‌బ్రిడ్జ్‌కు వెళ్లే ముందే వేదికలను సిద్ధం చేస్తాం" అని ఈసీబీ అధికార ప్రతినిధి స్థానిక మీడియాకు తెలిపారు. మొదట భారత్-ఏ జట్టుతో టీమ్‌ఇండియా సన్నాహక మ్యాచులు ఆడేందుకు ప్రణాళికలు వేసుకుంది. కొవిడ్-19 ఆంక్షల వల్ల అవి రద్దయ్యాయి.