Pollard Missing: వెస్టిండీస్ సారథి కీరన్ పొలార్డ్‌ను దారుణంగా ట్రోల్ చేశాడు అతడి సహచరుడు డ్వేన్ బ్రావో. 'పొలార్డ్ మిస్సింగ్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. మోదీ స్టేడియంలో భారత్‌తో మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో ఈ పోస్ట్ కాస్త వైరల్ అవుతోంది.
భారత్‌తో తొలి వన్డేలో చాహల్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఔటై గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు పొలార్డ్. అనంతరం గాయం కారణంగా రెండో వన్డేలో అతడు ఆడలేదు. మూడో వన్డేలోనూ పొలార్డ్ ఆడటంపై అనుమానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడిని ఓ ఆట ఆడుకున్నాడు బ్రావో.
"ఇది నిజంగా దుర్దినం. నా బెస్ట్ ఫ్రెండ్ కీరన్ పొలార్డ్ కనిపించడం లేదు. అతడెక్కడున్నాడో మీకెవరికైనా తెలిస్తే.. ఆ సమాచారాన్ని నాకు లేదా పోలీసులకు అందజేయండి." అని ఫన్నీగా ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చాడు బ్రావో. దాంతో పాటు అతడు చివరిసారిగా చాహల్ జేబులో కనిపించాడని పేర్కొన్నాడు.
'హమ్మయ్యా.. బతికే ఉన్నాడు'
దీనిపై చాలామంది క్రికెటర్లు చమత్కారంగా స్పందించారు. పొలార్డ్ కూడా నవ్వుతున్న ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు. దానికి.. 'హమ్మయ్యా.. బతికే ఉన్నాడు' అంటూ బదులిచ్చాడు బ్రావో.
విండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది టీమ్ఇండియా. శుక్రవారం మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది.
ఇదీ చూడండి: ధోనీ లేకపోతే నా కెరీర్ లేదు: బ్రావో