చెన్నై సూపర్‌కింగ్స్‌కు(Chennai super kings) మరో రెండేళ్లు ఎంఎస్ ధోనీనే(Dhoni) సారథ్యం వహిస్తాడని ఆ ఫ్రాంఛైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ అంటున్నారు. అతడి వయసు 40 దాటినా ఇబ్బందేమీ లేదన్నారు. మహీ కఠోరంగా శ్రమిస్తున్నాడని ఇప్పటికీ అత్యంత దారుఢ్యంగా ఉన్నాడని పేర్కొన్నాడు.
"మరో ఏడాదీ, రెండేళ్ల వరకు మహీ సీఎస్‌కేలో కొనసాగుతాడు. అతడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. కఠోరంగా శ్రమిస్తున్నాడు. అతడెందుకు ఆగిపోవాలి? అందుకు కారణాలేమీ కనిపించడం లేదు. ప్రస్తుతం అతడు చెన్నైకు చేస్తున్న దానిపట్ల మేం సంతృప్తిగా ఉన్నాం. ధోనీ కేవలం సారథి మాత్రమే కాదు. అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు, నాయకుడు, మార్గ నిర్దేశకుడు. అతనిప్పటికీ జట్టుకు ఎంతో విలువ తీసుకొస్తాడనే మా నమ్మకం. అతడో గొప్ప ఫినిషర్. ఇప్పటికీ మాకోసం అతడా పని చేస్తున్నాడు" అని కాశీ విశ్వనాథన్ తెలిపారు.
టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ బుధవారం 40వ పుట్టినరోజు జరుపుకున్నాడు. అతడి వయసు పెరగడం వల్ల వచ్చే ఐపీఎల్ సీజన్ ఆడతాడా లేదా అన్న సందిగ్ధం ఏర్పడింది. యూఏఈలో ఐపీఎల్ 2021 రెండో దశ పూర్తవ్వగానే అతడు మొత్తంగా క్రికెట్‌కు దూరమవుతాడని వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాశీ విశ్వనాథన్ స్పష్టతనిచ్చారు. మరి మహీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి!
ఇదీ చూడండి: 'ధోనీని చెన్నై ఎప్పటికీ వదులుకోదు.. అతడొక మహారాజు'