మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమ్ఇండియాకు రెండు సార్లు వరల్డ్ కప్, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన కెప్టెన్. ఇక ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న మహీ.. ఆ టీమ్‌కు నాలుగు సార్లు ట్రోఫీని అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఇప్పటికీ అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్ కోసం సన్నద్ధమవుతున్నాడు. చెపాక్ స్టేడియం వేదికగా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే ఈ సారి బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌తో పాటు బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో ఫుల్ వైరల్ అయింది.
వాస్తవానికి ధోనీ బౌలింగ్ చేయడాన్ని చాలా అరుదుగా చూస్తుంటాం. గతంలో ఎప్పుడో అంతర్జాతీయ క్రికెట్లో అతడు బౌలింగ్ చేశాడు. అయితే తాజాగా సీఎస్కే ట్రైనింగ్ క్యాంపులో మహీ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం క్రికెట్ అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతడు నెట్స్‌లో లెగ్ స్పిన్ శిక్షణ చేస్తూ కనిపించాడు. దీంతో ఐపీఎల్ తాజా సీజన్లో మహీ తన బౌలింగ్‌తో ఎలాంటి అద్భుతం చేయబోతున్నాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మహీ.. తన ఇంటర్నేషనల్ కెరీర్లో ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేశాడో మీకు తెలుసా?
అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు, వన్డే, టీ20ల్లో టీమ్ఇండియాకు ప్రాతినిథ్యం వహించిన ధోనీ.. తన బ్యాటింగ్, కీపింగ్‌తో ఎన్నో రికార్డులు సృష్టించాడు. అయితే బౌలింగ్ విషయానికొస్తే.. టీ20ల్లో తప్ప మిగిలిన రెండు ఫార్మాట్లలోనూ అతడు ప్రత్యర్థులపై పలు సందర్భాల్లో బంతుల్ని సంధించాడు. టెస్టు ఫార్మాట్లో 16 ఓవర్లు వేశాడు. అయితే వన్డేల్లో మాత్రం 6 ఓవర్లు మాత్రమే సంధించాడు. మొత్తంగా తన కెరీర్లో 22 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అంతేకాకుండా వన్డేల్లో ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇకపోతే ధోనీ నాయకత్వంలోనే చెన్నై సూపర్ కింగ్స్.. తాజా సీజన్లో బరిలోకి దిగబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్-సీఎస్కేతో జరగబోయే మ్యాచ్‌తోనే మార్చి 31న ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. కాగా, గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనతో 9వ స్థానంలో నిలిచి అభిమానులను నిరాశ పరిచింది. కానీ ఈ సారి అద్భుత ప్రదర్శన చేసి ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఇదే మహీకి ఆఖరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రచారం కూడా సాగుతోంది. ఈ సీజన్ చివర్లో అతడికి ఫేర్వెల్ కూడా నిర్వహిస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్.. IPL కోసం అదిరే మేకోవర్.. స్టైలిష్ట్ ఎవరో తెలుసా?