David warner Most Half centuries: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ వార్నర్(92*) ఓ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సూపర్ హాఫ్ సెంచరీతో మెరిసిన అతడు.. టీ20 క్రికెట్లో అత్యధిక అర్ధ శతకాలు నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇది అతడికి 84వ హాఫ్ సెంచరీ. దీంతో క్రిస్(అత్యధికంగా 83 అర్ధ శతకాలు) పేరిట ఉన్న రికార్డును వార్నర్ బ్రేక్ చేశాడు. గేల్ తర్వాత కోహ్లీ(77), అరోన్ ఫించ్(70), రోహిత్ శర్మ(69) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అంతేకాదు ఈ మ్యాచ్‌లో వార్నర్ మరో రికార్డును అందుకున్నాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మార్క్రమ్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా భారీ సిక్సర్ కొట్టిన అతడు.. టీ20 క్రికెట్లో 400వ సిక్సర్‌ను పూర్తి చేసుకున్నాడు. అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు.
Umran Malik 157 km bowling: ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ సంచలన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రెండో వేగవంతమైన బంతిని విసిరాడు. ఆఖరి ఓవర్లో నాలుగో బాల్‌ను 157 కిమీ వేగంతో వేశాడు. అంతకముందు సీఎస్కే జరిగిన మ్యాచ్‌లో 154 కిమీ వేగంతో బంతిని వేసిన అతడు తాజాగా తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. కాగా, ఈ సీజన్లో ఇప్పటివరకు టాప్ 5 ఫాస్టెస్ట్ డెలివరీల్లో నాలుగు ఉమ్రాన్ పేరిటే ఉన్నాయి. ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన ఉమ్రాన్.. 7 మ్యాచుల్లో ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డులను అందుకోవడం విశేషం.
ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన జాబితాలో షాన్ టైట్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2011లో రాజస్థాన్ రాయల్స్ తరఫున షాన్ టైట్ 157.71 కిమీ వేగంతో బంతిని సంధించడం విశేషం. ఇక అన్రిచ్ నోర్జే(156.22, 154.74), డేల్ స్టెయిన్ (154.4), కగిసో రబాడ(154.23) కిమీ వేగంతో మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో దిల్లీ విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ 186/8 పరుగులు చేసింది. పూరన్(62) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే అతడికి మిగతా బ్యాటర్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. దీంతో 21 పరుగుల తేడాతో ఓటమి పాలైన సన్‌రైజర్స్.. వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది.
ఇదీ చూడండి: IPL 2022: పూరన్ పోరాడినా.. దిల్లీ చేతిలో సన్‌రైజర్స్ పరాజయం