vishnu solanki ranji cricketer కొద్ది రోజుల వ్యవధిలోనే కూతుర్ని, కన్న తండ్రిని పోగొట్టుకున్నాడు ఓ రంజీ క్రికెటర్. ఇటీవలే పుట్టిన కుమార్తె, ఆ తర్వాత రోజే తుదిశ్వాస విడిచింది. ఆ చిన్నారి అంత్యక్రియలకు హాజరై, వెంటనే తర్వాత మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఆ మ్యాచ్‌లో సెంచరీ బాది కూతురికి అంకితమిచ్చాడు. ఆదివారం మళ్లీ ఆ ఆటగాడి జీవితంలో మరో విషాదం. అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి మరణించాడనే వార్త తెలిసింది. మార్చి 3న హైదరాబాద్‌తో మ్యాచ్ ఉండడం వల్ల తన తండ్రి చివరి చూపుకు హాజరు కాలేకపోయాడు. వీడియో కాల్‌లోనే తన తండ్రి అంత్యక్రియలను చూశాడు.
బరోడా బ్యాటర్ విష్ణు సోలంకికి కొన్ని రోజుల క్రితం కుమార్తె జన్మించింది. ఈ ఆనందం ఎంతో కాలం నిలవకుండానే అనారోగ్యంతో పాప మరణించింది. వార్త తెలుసుకున్న సోలంకి.. కుమార్తె అంత్యక్రియలకు హాజరయ్యాడు. అప్పటికే బెంగాల్‌తో మ్యాచ్‌కు దూరమైన అతడు.. తర్వాత చండీగఢ్‌తో మ్యాచ్‌కు జట్టులోకి వచ్చాడు. ఇంత బాధలోను ఈ మ్యాచ్‌లో శతకం బాదాడు.
ఇప్పుడు తన తండ్రి అనారోగ్యంతో మరణించాడనే వార్త సోలంకికి తెలిసింది. మార్చి 3న హైదరాబాద్ బరోడా తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ వీడియో కాల్‌లోనే అంత్యక్రియలకు హాజరయ్యాడు. ఇంతటి విషాదంలోనూ అతడికి ఆట పట్ల ఉన్న అంకితభావానికి పలువురు అభినందిస్తున్నారు.
గతంలో సచిన్, విరాట్ కోహ్లీకి ఇలాంటి ఘటనలే ఎదురయ్యాయి. బ్రిస్టల్‌లో మ్యాచ్ ఆడతుండగా సచిన్ తండ్రి మరణించారు. అంతటి బాధను దిగమింగుకుని ఆ మ్యాచ్‌లో సచిన్ సెంచరీ బాదాడు. గతంలో విరాట్ కోహ్లీ తండ్రి కూడా కన్నుమూసిన సమయంలో, ఓ మ్యాచ్‌లో 97 పరుగులు చేసిన తర్వాత విరాట్.. తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు.
ఇదీ చదవండి: పీఎస్ఎల్ విజేతగా లాహోర్.. కెప్టెన్‌గా షహీన్ అఫ్రిది రికార్డు