టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు కూడా శాంసన్‌కు భారత తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ క్రమంలో భారత జట్టు మేనేజేమెంట్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కీలక వ్యాఖ్యలు చేశాడు. వరుసగా విఫలమవుతున్న రిషభ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లకు ఇవ్వకపోవడం పట్ల బీసీసీఐపై కనేరియా విమర్శల గుప్పించాడు.
అయితే భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడుకు జరిగిన అన్యాయమే ఇప్పుడు సంజూ శాంసన్‌కు జరుగుతోంది అని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రాయుడుకి చోటు దక్కుతుందని అంతా భావించారు. అయితే ఎంఎస్‌కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనూహ్యంగా రాయుడిని ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. దీంతో నిరాశకు గురైన రాయుడు 2019లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
"సంజూ శాంసన్ లాంటి అద్భుతమైన ఆటగాడికి తరుచూ అన్యాయం జరుగుతోంది. ప్రతీ ఒక్క ఆటగాడికి కొంతవరకే సహనం, ఓపిక ఉంటుంది. అతడు నిరాశకు గురై రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అప్పుడు భారత జట్టు ఒక మంచి ఆటగాడిని కచ్చితంగా కోల్పోతుంది. ఏ జట్టు అయినా మంచి ఫుల్ పాట్లు, ఎక్స్‌ట్రా కవర్ డ్రైవ్‌లు ఆడే ఆటగాడు కావాలని భావిస్తోంది. కానీ భారత జట్టు మాత్రం సంజూ లాంటి అద్భుతమైన ఆటగాడిని పక్కన పెడూతూ వస్తోంది. అంబటి రాయుడు కెరీర్ కూడా ఇలాగే ముగిసింది. అతడు భారత్ తరఫున అద్భుతంగా రాణించాడు. కానీ అతడి పట్ల బీసీసీఐ చిన్నచూపు చూసింది. బీసీసీఐ, సెలక్షన్ కమిటీ అంతర్గత రాజకీయాలకు రాయడు బలైపోయాడు" అని తన యూట్యూబ్ ఛానల్‌లో కనేరియా పేర్కొన్నాడు.