క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తూ ప్రపంచకప్ సమరం ముగిసింది. పది జట్లు తమ శాయశక్తులా ట్రోఫీ కోసం శ్రమించాయి. కొన్ని అంచనాలను మించి రాణిస్తే మరికొన్ని ఒత్తిడికి తలొగ్గి నిరాశపరిచాయి. అన్ని జట్ల సారథులు వారి వ్యూహాలతో మెప్పించారు. ఈ టోర్నీలో సత్తాటాటిన కెప్టెన్ల ఎంత మేర ప్రభావం చూపగలిగారో చూద్దాం.
![worldcup captains with rankings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/all-of-them_2705newsroom_1558939282_925.jpg)
- విలియమ్సన్ ( న్యూజిలాండ్-9.5/10)
న్యూజిలాండ్ సారథి విలియమ్సన్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తూ జట్టును ముందుండి నడిపించాడు. ఒత్తిడి సమయంలోనూ సమయోచితంగా ఆలోచిస్తూ అభిమానుల మదిని గెలిచాడు. ఫైనల్ మ్యాచ్ ఓటమి అనంతరం విలియమ్సన్ చూపిన పరిపక్వత చెప్పుకోదగినది. బౌలింగ్, ఫీల్డర్లను సమయోచితంగా మారుస్తూ మెప్పించాడు.
![worldcup captains with rankings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kane_1507newsroom_1563155429_394.jpg)
- మోర్గాన్ (ఇంగ్లాండ్-9/10)
2015 ప్రపంచకప్‌లో విఫలమయ్యాక ఇంగ్లాండ్ జట్టును మరింత చురుగ్గా నడపడంలో మోర్గాన్ సఫలమయ్యాడు. ఈ ఆటగాడి సారథ్యంలో ఈసారి ఫేవరేట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగింది ఇంగ్లీష్ సేన. సొంత గడ్డపై జరగడం కాస్త ఒత్తిడి కలిగించినా.. అభిమానుల అంచనాలను నిజం చేస్తూ జట్టును ముందుండి నడిపించాడు. ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగాలన్న మెర్గాన్ నిర్ణయం సరైందని నిజం చేస్తూ కప్పు ఎగరేసుకుపోయింది ఇంగ్లాండ్.
![worldcup captains with rankings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/skysports-eoin-morgan-england_4718433_1607newsroom_1563242831_602.jpg)
- కోహ్లీ (భారత్-7.5/10)
ప్రపంచకప్‌లో విరాట్ సారథిగా చాలా పరిణితితో కనిపించాడు. బౌలర్ల మార్పు, ఫీల్డర్ల కూర్పు విషయంలో మంచి నేర్పు చూపించాడు. బ్యాట్స్‌మెన్‌గానూ రాణించాడు. అయితే ఈ వరల్డ్‌కప్‌లో ఒక్క సెంచరీ అయినా లేకపోవడం కాస్త లోటుగా చెప్పవచ్చు.
మాజీ సారథి గంగూలీ... కోహ్లీ కెప్టెన్సీని మెచ్చుకున్నాడంటే అతడి ప్రతిభ అర్ధం చేసుకోవచ్చు. కానీ సెమీ ఫైనల్లో విరాట్ చేసిన కొన్ని తప్పిదాలు జట్టుకు ట్రోఫీని దూరం చేశాయి.
![worldcup captains with rankings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/aacxnpg_1806newsroom_1560837985_120_1207newsroom_1562921311_971.jpg)
- ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా-7/10)
స్టీవ్ స్మిత్ బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత జట్టు పగ్గాలు చేపట్టిన ఫించ్ ఆసీస్‌ను సమర్థంగా ముందుకు నడిపించాడు. ప్రపంచకప్‌లో బౌలర్లను ఉపయోగించిన విధానం.. క్యాచ్ పొజిషన్లో ఫీల్డర్లను మార్చడం వంటి నిర్ణయాలతో మెప్పించాడు. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగి జట్టుకు అవసరమైన పరుగులు చేయడంలో సఫలమయ్యాడు. కానీ సెమీ ఫైనల్లో అంచనాలకు తగ్గట్టు రాణించకపోవడం నిరాశపర్చింది.
![worldcup captains with rankings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3665616_aaron-finch2.jpg)
- సర్ఫరాజ్ అహ్మద్ (పాకిస్థాన్-6/10)
అస్థిరతకు మారు పేరైన పాకిస్థాన్ జట్టు ఈ ప్రపంచకప్‌లోనూ అదే ప్రదర్శనను కొనసాగించింది. మొదట మంచి ప్రదర్శన చేసి అనంతరం చతికిలపడి కీలక సమయాల్లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్ రేసులో నిలిచింది. భారత్ మ్యాచ్ తర్వాత సర్ఫరాజ్ సారథ్యంపై విమర్శలు వచ్చాయి. అనంతరం పుంజుకున్న జట్టు మంచి ప్రదర్శన కనబర్చింది. కానీ నెట్ రన్‌రేట్ పరంగా కాస్త వెనుకబడి లీగ్ దశలోనే నిష్క్రమించింది.
![worldcup captains with rankings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/sarfraz-ahmed_2706newsroom_1561611691_1041.jpg)
- కరుణరత్నే (5.5/10)
లీగ్ దశను ఆరో స్థానంలో ముగించిన శ్రీలంక జట్టు కొన్ని మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శనే కనబర్చింది. అయితే కీలక సమయాల్లో తడబడింది. ప్రపంచకప్‌కు ముందు కరుణరత్నే సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఆరంభ దశలో లంక జట్టుపై ఏమాత్రం అంచనాలు లేవు. కానీ ఇంగ్లాండ్... వెస్టిండీస్ లాంటి జట్లను ఓడించి వారి ఉనికిని చాటుకున్నారు లంకేయులు. ఈ క్రెడిట్ మొత్తం కరుణరత్నేకే చెందుతుంది.
![worldcup captains with rankings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/dimuth-karunaratne_1406newsroom_1560523665_871.jpg)
వీరితో పాటు మొర్తజా సారథ్యంలోని బంగ్లాదేశ్ మంచి ప్రదర్శనే కనబర్చింది. దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ ఈ ప్రపంచకప్‌లో తేలిపోయాడని చెప్పవచ్చు. గుల్బదిన్ నైబ్ అనుభవ లేమి అఫ్గానిస్థాన్ జట్టును ఇబ్బందులకు గురి చేసింది. విండీస్ కెప్టెన్ హోల్డర్ ప్రభావం అంతంతమాత్రంగానే కనిపించింది.