టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ఈ ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌లో అనుకున్నంతగా రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో ధోని బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు అతడు ఉపయోగిస్తోన్న బ్యాట్లు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రపంచకప్‌లో మిస్టర్ కూల్ ఆడిన ప్రతి ఇన్నింగ్స్‌లోనూ వివిధ లోగోలున్న బ్యాట్లతో బరిలోకి దిగడాన్ని సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుపట్టారు. స్పాన్సర్లతో ధోని భారీగా ఒప్పందాలు కుదుర్చుకొని డబ్బులు సంపాదిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై తాజాగా స్పందించాడు ధోని మేనేజర్ అరుణ్ పాండే.
రహస్యమిదే...
ఈ ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో బీఏఎస్, ఎస్జీ, ఎస్ఎస్ బ్యాట్లతో బరిలోకి దిగుతున్నాడు మహీ. అయితే ప్రతి మ్యాచ్‌లో బ్యాట్ మార్చడానికి కారణాన్ని చెప్పుకొచ్చాడు ధోని మేనేజర్ అరుణ్ పాండే.
" ధోని వివిధ లోగోలున్న బ్యాట్లతో ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడటానికి ఓ కారణముంది. అతడు ప్రస్తుతం వినియోగిస్తోన్న బ్యాట్ల స్పాన్సర్లు తన కెరీర్‌లోని అన్ని సమయాల్లో చాలా మద్దతిచ్చి భరోసాగా నిలిచారు. దానికి కృతజ్ఞతా భావంగా ప్రపంచకప్‌లో బ్యాట్లు మారుస్తూ ఆడుతున్నాడు. దానికోసం వారి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు. ధోని మంచి భావనతోనే ఇదంతా చేస్తున్నాడు ".
-- ధోని మేనేజర్, అరుణ్ పాండే
రిటైర్మెంట్ కారణమా...?
బ్యాట్లపై లోగోల విషయంపై సందిగ్ధం తుడిచేసిన మేనేజర్... ధోని రిటైర్మెంట్ అంశానికి మాత్రం కాస్త బలం చేకూర్చాడు. అత్యవసరంగా ధోని స్పాన్సర్లకు కృతజ్ఞతాభావం ఎందుకు తెలియబరచాలనుకుంటున్నాడని అడుగుతూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.
ప్రపంచకప్‌లో భారత్ ఆడే ఆఖరి మ్యాచ్ ధోనికి చివరిదని బాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ భారత్ ఫైనల్ చేరి, జులై 14న కప్పు గెలిస్తే.. ధోనికి అది ఘనమైన వీడ్కోలు అవుతుంది.