ప్రపంచకప్.. చేతిలోకి తీసుకుని ముద్దాడాలని ప్రతీ క్రికెటర్ కలలు కంటాడు. అందుకోసం మైదానంలో చెమటను చిందిస్తాడు. కానీ కొంతమందే ఆ కలను నిజం చేసుకోగలుగుతారు. జట్టుగా ఆడినప్పుడే వరల్డ్‌కప్‌ను చేజిక్కించుకునే అవకాశం దొరుకుతుంది. ఇలా ప్రపంచ క్రికెట్ చరిత్రలో తమ బ్యాటింగ్ వాడిని చూపించినా.. మెగాటోర్నీని దక్కించుకోలేకపోయిన కొంతమంది దిగ్గజ క్రికెటర్ల గురించి ఇప్పుడు చూద్దాం!
సౌరవ్ గంగూలీ..

1999 నుంచి 2007 వరకు మూడు ప్రపంచకప్‌లు ఆడిన సౌరవ్ గంగూలీ వరల్డ్‌కప్ కల మాత్రం తీర్చుకోలేకపోయాడు. 2003లో తన సారథ్యంలో ఫైనల్ వరకు చేరగలిగినా.. నిరాశే మిగిలింది. ఈ టోర్నీలో గంగూలీ మూడు శతకాలతో ఆకట్టుకున్నాడు. 2007లో భారత్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. 2011లో టీమిండియా ప్రపంచకప్ సాధించినప్పటికీ గంగూలీ అప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచకప్ టోర్నీల్లో 22 మ్యాచ్‌లాడిన గంగూలీ 55.88 సగటుతో 1006 పరుగులు చేశాడు.
కుమార సంగక్కర..

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ తర్వాత వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కుమార సంగక్కర. నాలుగు ప్రపంచకప్‌లు ఆడిన సంగక్కరకు వరల్డ్‌కప్ ఆశ తీరలేదు. 2007, 2011 టోర్నీల్లో శ్రీలంక ఫైనల్ వరకు చేరినా.. ప్రపంచకప్‌ను ముద్దాడలేకపోయాడు. చివరగా 2015 ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌లో దక్షిణాఫ్రికాపై ఓడిపోయింది శ్రీలంక. ఈ మ్యాచ్ తర్వాత సంగక్కర రిటైర్మెంట్ ప్రకటించాడు. శ్రీలంక 1996 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోగా.. అప్పటికి సంగక్కర అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేయలేదు.
బ్రయన్ లారా..

టెస్టు క్రికెట్ చరిత్రలో తనదైన ముద్రవేసిన బ్రయన్ లారా ఆ స్థాయిలో కాకపోయిన వన్డేల్లోనూ ఆకట్టుకున్నాడు. 299 వన్డేలాడిన ఈ విండీస్ దిగ్గజం 10వేల పైచిలుకు పరుగులు చేశాడు. ఆరంభం నుంచి బౌలర్లపై విరుచుకుపడి ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టించే లారా ప్రపంచకప్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. 1975, 1978 ప్రపంచకప్ విజేతగా నిలిచిన విండీస్ ఆ తర్వాత టైటిల్‌ను అందుకోలేదు.
జాక్వస్ కలీస్...

ప్రపంచ క్రికెట్లో ఉన్న నాణ్యమైన ఆల్రౌండర్లలో జాక్వస్ కలీస్ ఒకడు. సనత్ జయసూర్య తర్వాత టెస్టు, వన్డే రెండు ఫార్మాట్ల్లో పదివేల పరుగులతో పాటు 250కు పైగా వికెట్లు తీసిన ఆటగాడిగా కలీస్ రికార్డు సృష్టించాడు. 17 శతకాలు, 86 అర్ధ శతకాలు చేసిన కలీస్‌కు ప్రపంచకప్ కల తీరలేదు. ఇలాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా.. దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవలేకపోయింది.
ఏబీ డివిలియర్స్...

మైదానంలో బ్యాట్‌తో అన్ని వైపుల చెలరేగి ఆడే డివిలియర్స్ వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు చేశాడు. అబ్బురపరిచే షాట్లతో ఈ తరం ఆటగాళ్లకు స్ఫూర్తినింపే ప్లేయర్ డివిలియర్స్. వెస్టిండీస్‌పై 31 బంతుల్లో శతకం చేసి ప్రపంచంలోనే వేగవంతంగా సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఫార్మాట్ ఏదైనా బౌలర్లకు నిద్రపట్టనీయకుండా విధ్వంసం సృష్టించడంలో ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు దిట్ట. అయితే సౌతాఫ్రికాకు ప్రపంచకప్ కల మాత్రం నెరవేర్చలేకపోయాడు. 1996, 1999, 2015లో సెమీస్ వరకు చేరినా ఫైనల్‌కు మాత్రం వెళ్లలేకపోయింది దక్షిణాఫ్రికా.
షాహిద్ అఫ్రిదీ...

1996లో అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేసిన షాహిద్ అఫ్రిదీ ప్రపంచకప్‌ను ముద్దాడలేకపోయాడు. 37 బంతుల్లోనే వేగంవంతమైన శతకం చేసి రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును చాలారోజుల పాటు ఎవ్వరూ దరిచేరలేకపోయారు. బ్యాటింగ్‌లోనే కాకుండా తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టేయగల సమర్థుడు అఫ్రిదీ. వన్డేల్లో 398 వికెట్లు తీసిన అఫ్రిదీకీ ప్రపంచకప్ అందని ద్రాక్షలాగే మిగిలింది. 1992 పాక్ ప్రపంచకప్ నెగ్గినా.. అప్పటికీ అఫ్రిదీ ఇంకా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేయలేదు.
వకార్ యూనీస్..

పాకిస్థాన్ 1992 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అయితే ఆ జట్టులో వకార్ సభ్యుడిగా ఉన్నప్పటికీ వరల్డ్‌కప్ సంబరాలకు దూరమయ్యాడు. గాయం కారణంగా వకార్ ఫైనల్ మ్యాచ్ ఆడలేదు. ఇంకో విశేషమేంటంటే 1992 టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వకార్ రికార్డు సృష్టించాడు. 1999లోనూ ఆస్ట్రేలియాతో ఫైనల్లో తలపడి పాకిస్థాన్ ఓటమి చవిచూసింది. అప్పుడూ కూడా వకార్ జట్టులో ఉన్నాడు. ఈ కారణంగా రెండు సార్లు ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశాన్ని కోల్పోయాడు వకార్.