నాలుగు నెలల వ్యవధిలో ఓ క్రికెటర్ జీవితం ఇంతగా మారిపోవడం అనూహ్యం! ఐపీఎల్-13 ఆరంభానికి ముందు తమిళనాడు ఫాస్ట్‌బౌలర్ నటరాజన్ గురించి భారత క్రికెట్ అభిమానులకు పెద్దగా తెలియదు. కొన్నేళ్ల కిందటే పంజాబ్ తరఫున ఐపీఎల్ ఆడినా అంతగా రాణించలేదు. ఆ తర్వాత తమిళనాడు టీ20 లీగ్‌లో, ఆ రాష్ట్ర రంజీ జట్టు తరఫున సత్తా చాటాడు. నట్టూను వేలంలో కొనుక్కున్న సన్‌రైజర్స్.. ముందు తుది జట్టులో ఆడించలేదు. అయితే భువనేశ్వర్ గాయపడటం వల్ల అతడికి అవకాశం దక్కింది. దానిని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. నిలకడగా యార్కర్లు విసురుతూ మేటి బ్యాట్స్‌మెన్‌కు సవాలు విసిరాడు. అలా భారత సెలక్టర్ల దృష్టిలో పడి.. అనుకోకుండా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
నిజానికి ముందు ఆస్ట్రేలియా పర్యటనకు నటరాజన్ ఎంపిక కాలేదు. అయితే కోల్‌కతా తరఫున సత్తా చాటి ఆస్ట్రేలియాతో టీ20లకు ఎంపికైన తమిళనాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడటం వల్ల అతడి స్థానంలో నట్టూ టీ20లకు ఎంపికయ్యాడు. అయితే వన్డే సిరీస్ ముంగిట నవ్‌దీప్ సైని వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో బ్యాకప్ బౌలర్‌గా వన్డే జట్టులోనూ అతడికి చోటు దక్కింది. రెండో వన్డే తర్వాత షమికి విశ్రాంతినివ్వడం వల్ల తుది జట్టులో ఆడే అవకాశం దక్కింది. ఆ మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శన చేయడం వల్ల టీ20 సిరీస్ మొత్తం ఆడే అవకాశం దక్కింది. అందులోనూ రాణించాడు. ఇప్పుడు ఉమేశ్ స్థానంలో టెస్టు జట్టులోకి కూడా వచ్చేశాడు. నాలుగు నెలల ముందు వరకు ఎవరికీ తెలియని నట్టూ ఇప్పుడు.. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. అదృష్టం కొద్దీ వన్డే, టీ20 జట్లలో చోటు దక్కినా.. తన ప్రదర్శనతో ఆ అవకాశాల్ని అతను గొప్పగా ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు టెస్టుల్లోనూ తన మ్యాజిక్‌ను కొనసాగిస్తాడా అన్నది ఆసక్తికరం. జనవరి 7 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో అతడికి చోటు కల్పిస్తారా లేదో చూడాలి?
ఇవీ చదవండి: