ప్రపంచకప్ సమయంలో టీమిండియా సెలక్టర్లు బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మకు టీ అందించారని మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. అనుష్కపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని.. ఇందులో ఆమెను లాగడం సరైనది కాదని స్పష్టం చేశాడు విరాట్.
"ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన ఒక్క మ్యాచ్‌కు మాత్రమే అనుష్క హాజరైంది. ఫ్యామిలీ బాక్స్, సెలక్టర్ బాక్స్ రెండు వేరు వేరు. ఆమె ఉన్న బాక్స్‌లో సెలక్టర్లు ఎవరూ లేరు. అనుష్క తన స్నేహితులతో అక్కడకు వచ్చింది. ఆమె అందరికీ తెలిసిన వ్యక్తి, అందులోనూ పాపులర్ హీరోయిన్. అందుకే ఆమె పేరును తీసుకొచ్చారు" - విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి.
అనవసరంగా మధ్యలో అనుష్క శర్మ పేరు ఇందులోకి తెచ్చారని కోహ్లీ అన్నాడు.
"సెలక్టర్లను ప్రస్తావించాలనుకుంటే వారి గురించి మీరు(ఫరూఖ్) మాట్లాడండి. అంతే కానీ మధ్యలో అనుష్క పేరును ఎందుకు తీసుకొచ్చారు. చుట్టూ అందరూ అబద్దాలనే ప్రచారం చేస్తే.. కొన్ని రోజుల తర్వాత వాటినే నిజమనుకుంటారు. అక్కడ నిజంగా ఏం జరిగిందో ఏదో ఒక రోజు మీరు చెప్పాల్సి ఉంటుంది" - విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
ఆమె పేరును వాడుకొని ఎందుకు సంచలనం సృష్టంచాలనుకుంటారో తనకు అర్థం కావట్లేదని కోహ్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బహుశా అనుష్క అయితే వెంటనే ప్రతిస్పందించలేదేమోనని ఆమెను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పాడు.
ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెలక్టర్లు ఎమ్ఎస్కే ప్రసాద్ తదితరులు ఉన్న బాక్స్‌లో అనుష్క ఉన్నారని, వాళ్లలో ఒకరు ఆమెకు టీ అందించారని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఫరూఖ్ ఇంజినీర్.
ఇదీ చదవండి: 'గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటేనే అవకాశమా?'