పంద్రగాస్టున టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించాడు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్. మహీ తన కెరీర్లో సాధించడానికి ఇంకేమీ మిగలలేదని.. అతడి రిటైర్ ప్రకటనతో ఓ శకం ముగిసినట్లైందని చెప్పాడు.
"ధోనీ రిటైర్మెంట్ ప్రకటనతో ఓ శకం ముగిసినట్లైంది. అంతకంటే ఎక్కువనే చెప్పాలి. అతడి సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్ఇండియా గెలిచింది. అతడో తిరుగులేని నాయకుడు, గొప్ప వికెట్ కీపర్, బలమైన బ్యాట్స్మన్. తన స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వంతో జట్టు ఆటగాళ్లందరిలో ఉత్సహాం నింపిన వ్యక్తి. ఇక అతడు సాధించడానికి ఇంకే మిగిలింది? కానీ అతడు మళ్లీ టీమ్ఇండియా జెర్సీ ధరించకపోవడమనేది బాధాకర విషయం. అయితేనేం చాలా కాలం తర్వాత మళ్లీ ఐపీఎల్లో మహీ ఆడటం సంతోషకరమైన అంశం. ఇప్పటి నుంచి సీఎస్కే యూనివర్సల్ బ్రాండ్."
- ఎన్ శ్రీనివాసన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, సీఎస్కే ఫ్రాంచైజీ యజమాని.
ధోనీ ఐపీఎల్ కెరీర్ను ఎప్పటికీ కొనసాగిస్తాడని తెలిపాడు శ్రీనివాసన్. సీఎస్కే జట్టును విజయపథం వైపు నడిపించాడని అన్నాడు. ఆటగాళ్లలో ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సాహించే అసాధారమైన నైపుణ్యం మహీలో ఉందన్నాడు . అందుకే ఐపీఎల్లో సీఎస్కే పటిష్ఠమైన జట్టుగా రూపుదిద్దుకుందని.. ఇందుకోసం మహీ ఎంతో కృషి చేశాడని తెలిపాడు. తామిద్దరి మధ్య చక్కనైన సమన్వయం, బంధం ఉందని చెప్పుకొచ్చాడు.
ఇది చూడండి 'రైనా ఆ స్థానంలో ఆడుంటే మరింత రాణించేవాడు'