ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో తాను సెంచరీ చేసినప్పుడు చెన్నై అభిమానులు ఉత్సాహాపరిచారని అంటున్నాడు టీమ్ఇండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. అయితే, హీరో అజిత్ నటిస్తున్న 'వాలిమై' అప్‌డేట్ గురించి తనతో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్ మొయిన్ అలీని ప్రేక్షకులు అడిగారని తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడించాడు.
"తమిళ ప్రజలకు సినిమాలంటే అంతలా ఇష్టమని నాకు తెలియదు. బౌండరీ లైన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అశ్విన్.. అశ్విన్.. అని పిలిచారు. దానికి బదులుగా వెనక్కి తిరిగితే.. 'వాలిమై' సినిమా అప్‌డేట్ ఏంటి అని ఓ అభిమాని అడిగాడు. తర్వాత రోజు గూగుల్‌లో దాని గురించి తెలుసుకున్నా. అయితే మొయిన్ అలీ కూడా నా దగ్గరకు వచ్చి వాలిమై అంటే ఏంటని అడిగాడు. అప్పుడు నాకు అర్థమైంది. అలీని కూడా వాళ్లు అడిగారని. అయితే ఆ సినిమా గురించి ఇంగ్లాండ్ ఆటగాడిని అడగటమే చాలా ఫన్నీగా అనిపించింది."
- రవిచంద్రన్ అశ్విన్, టీమ్ఇండియా క్రికెటర్
మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ శతకం సాధించినప్పుడు మహ్మద్ సిరాజ్ చేసిన సంబరాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. సహచర ఆటగాడు మూడంకెల స్కోరును అందుకున్నాడని సిరాజ్ సంతోషంతో గాల్లోకి పంచ్‌లు విసిరాడు. అయితే, అంతకుముందు టీమిండియా 237 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోవడం వల్ల.. అప్పటికి 77 పరుగులే చేసిన అశ్విన్ సెంచరీ సాధిస్తాడా లేదా అని అందరిలో ఉత్కంఠ పెరిగింది. అయితే ఆ సమయంలో సిరాజ్ ఆఖరి వరకు నిలబడతానని తనకి భరోసా ఇచ్చాడని అశ్విన్ తెలిపాడు.
ఇదీ చూడండి: 'వాళ్లను ఐపీఎల్ ఆడకుండా ఆపలేం'