టీమ్‌ఇండియా టెస్టు క్రికెట్‌లో అజింక్య రహానె కీలక ఆటగాడు. విదేశాల్లోనూ రాణించే సత్తా ఉన్న బ్యాట్స్‌మన్. అందుకు తగ్గట్టే ఇప్పటివరకు 65 మ్యాచ్‌ల్లో 11 శతకాలతో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అలాంటి క్రికెటర్ చాలా కాలం నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమయ్యాడు. 2016లో చివరిసారి టీ20 ఆడిన అతడు 2018 ఫిబ్రవరిలో ఆఖరుగా వన్డే మ్యాచ్‌లో కనిపించాడు. అప్పటి నుంచీ పొట్టి క్రికెట్‌కు దూరమైన అతడు మళ్లీ ఆయా ఫార్మాట్లలో రాణించాలనుకుంటున్నాడు. మరోవైపు ఐపీఎల్‌లో మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో అద్భుతంగా మెరుగైన రహానె రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా మారాడు. తాజాగా దీప్‌దాస్ గుప్తాతో ఓ కార్యక్రమంలో మాట్లాడిన అతడు తన బ్యాటింగ్ విషయంలో ద్రవిడ్ చేసిన సూచనలు వెల్లడించాడు.
"టీ20ల్లో కొన్నిసార్లు ఆడే షాట్లు మంచివి అనిపించవు. దాంతో చెత్త షాట్ ఆడబోయి ఔటయ్యామని బ్యాట్స్‌మన్ భావిస్తారు. అయితే, రాహుల్ భాయ్ నాకో విషయం చెప్పాడు. అదేంటంటే.. మనం ఆడిన షాట్లు ఎలాంటివనే విషయం పట్టించుకోకూడదని చెప్పాడు. పొట్టి క్రికెట్‌లో బ్యాట్స్‌మన్ కేవలం బంతిని మాత్రమే చూసి బలంగా షాట్లు ఆడాలన్నాడు. ఏ షాట్ ఆడినా దాని మీద ఆ బ్యాట్స్‌మన్ ప్రభావం కనపడాలన్నాడు."
-రహానె, టీమ్‌ఇండియా క్రికెటర్
అనంతరం తన బ్యాటింగ్‌పై స్పందించిన రహానె.. పొట్టి క్రికెట్‌లో తాను ఎవరి ఆటనూ అనుకరించనని వెల్లడించాడు. తాను ఆడే షాట్లు తన సొంతమని చెప్పాడు. ఒక షాట్ ఆడాలంటే దానిపై కచ్చితమైన అంచనా ఉండాలని వివరించాడు. ఆడిన బంతులను బట్టి స్ట్రైక్ రేట్ ఉండాలని, ఓవర్లను బట్టి మంచి స్కోర్ సాధించాలని రహానె పేర్కొన్నాడు.