ఉత్తరాఖండ్ కోచ్‌గా ఉన్నప్పుడు జట్టు ఎంపికలో ఓ మతానికి చెందిన ఆటగాళ్లకు తాను ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రయత్నించినట్లు ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం అధికారులు చేసిన ఆరోపణలను వసీమ్ జాఫర్ ఖండించాడు. సెలక్టర్లు, సంఘం కార్యదర్శి.. పక్షపాతం కారణంగా అనర్హులు జట్టు ఎంపికవుతున్నారని ఆరోపిస్తూ జాఫర్ మంగళవారం నాడు కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు.
తాజాగా తనపై వస్తున్న ఆరోపణలపై అతడు స్పందిస్తూ.. "మతపరమైన అంశాలను క్రికెట్లోకి తీసుకురావడం చాలా బాధ కలిగిస్తోంది. ఇక్బాల్ అబ్దుల్లాను కెప్టెన్ చేసేందుకు ప్రయత్నించినట్లు నాపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. జై బిస్టాను సారథిగా నియమించాలని అనుకున్నా. కానీ రిజ్వాన్ సహా ఇతర సెలక్టర్లంతా.. ఇక్బాల్‌ను కెప్టెన్ చేయమని సూచించారు. సీనియర్ ఆటగాడైన అతనికి ఐపీఎల్ ఆడిన అనుభవం కూడా ఉందని చెప్పడం వల్ల నేను సరేనన్నా. అలాగే బయో బబుల్‌ల్లోకి మత గురువులను తీసుకొచ్చానని, అక్కడ మేం నమాజ్ చేశామని సంఘం అధికారులు అంటున్నారు. అయితే నేనో విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. దెహ్రాదూన్‌లో శిబిరం సందర్భంగా రెండు లేదా మూడు శుక్రవారాలు మాత్రమే మౌలానా వచ్చారు. నేను ఆయనను పిలవలేదు. కేవలం శుక్రవారం ప్రార్థనల కోసం ఇక్బాల్ అబ్దుల్లా (ఉత్తరాఖండ్ ఆటగాడు) నాతోపాటు మేనేజర్ అనుమతి కోరాడు" అని జాఫర్ చెప్పాడు. సాధన పూర్తయ్యాకే ప్రార్థనలు జరిగాయని, దీన్ని ఎందుకు ఇంత పెద్ద విషయం చేస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పాడు.
ఇదీ చూడండి: 'నేను టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్‌ను కాదు'