భారత్-శ్రీలంక మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్.. కులశేఖర బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన ధోనీ.. దేశం మొత్తం సంబరాలు.. మైదానంలో సచిన్‌ను భుజాలపై ఎత్తుకుని తిరిగిన భారత క్రికెటర్లు.. ఇవన్నీ మొన్న మొన్న జరిగినట్లే ఉన్నాయి కానీ వీటికి అప్పుడే పదేళ్లు పూర్తయిందంటే నమ్మలేకపోతున్నాం. ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్న అప్పటి టీమ్ఇండియా మేనేజర్ రంజీబ్ బిస్వాల్.. ధోనీ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
"మ్యాచ్ గెలిచిన తర్వాత ఉదయం 4:30 గంటలకు వరకు జట్టులోని ఆటగాళ్లందరూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరి గదుల్లోకి వారు వెళ్లిపోయారు. అయితే ఉదయం లేచి చూసేసరికి ధోనీ గుండుతో కనిపించాడు. దానికి కారణం తెలియనప్పటికీ.. ఆ సంఘటన మాత్రం మాతో ఎప్పటికీ నిలిచిపోతుంది" అని బిస్వాల్ చెప్పారు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లంక.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. అనంతరం 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది టీమ్ఇండియా. ధోనీ కొట్టిన గెలుపు సిక్స్‌ను ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.