మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్ కోసం అన్ని జట్లూ తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా చెమటోడ్చుతోంది. ఆటగాళ్లు నిత్యం ప్రాక్టీస్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ప్రాక్టీస్ విషయంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు.
"తక్కువ సమయమే కష్టపడినా నేను ఆశించేది మెరుగైన సాధన. క్వాంటిటీ కన్నా నేను క్వాలిటీకే ప్రాధాన్యమిస్తా. రెండున్నర గంటలు పరుగెత్తి ఆటగాళ్లు అలిసిపోవడం కాదు నాకు కావాల్సింది. తక్కువ పని చేసినా కచ్చితమైన ఫలితం ఉండాలి. కష్టపడేటప్పుడు తీవ్రత ఉండాలి. ఈ రోజు ప్రాక్టీస్ బాగా జరిగింది. కొద్ది రోజులుగా సాధన చేస్తుండడం వల్ల ఆటగాళ్లలో కసి పెరిగింది. ఇప్పుడు తీవ్రత కనిపిస్తోంది. సిబ్బంది కూడా మమ్మల్ని అలా ప్రోత్సహించడం సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల విశ్రాంతి తర్వాత సాధన చేయడం ప్రారంభించడం వల్ల ఒకేసారి కాకుండా నెమ్మదిగా తీవ్రత పెరిగేలా కోచ్‌లు పర్యవేక్షిస్తున్నారు."
-కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్
సెప్టెంబర్ 19న అబుదాబి వేదికగా తొలి మ్యాచ్.. ముంబయి ఇండియన్స్, సీఎస్కే జట్ల మధ్య జరగనుంది. 20న దుబాయ్ వేదికగా దిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తలపడనున్నాయి. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 21న సన్ రైజర్స్ హైదరాబాద్‌తో దుబాయ్‌లో పోటీపడనుంది.