ఢాకా వేదికగా, 2012లో జరిగిన ఆసియాకప్‌లో భారత్-పాకిస్థాన్ లీగ్ మ్యాచ్.. తన కెరీర్లో గేమ్ ఛేంజర్ అని చెప్పాడు ప్రస్తుత టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ పోరులో అనేక రికార్డులు నమోదయ్యాయి. విరాట్ 183 పరుగులు చేసి, తన వన్డే కెరీర్లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడం కాకుండా, పాక్‌పై ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాడిగా ఘనత దక్కించుకున్నాడు. ఇటీవలే స్పిన్నర్ అశ్విన్‌తో ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడుతూ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు విరాట్. ఆ మ్యాచ్ తీపి జ్ఞాపకంగా తనకెప్పుడు గుర్తుండిపోతుందని తెలిపాడు.
"పాక్ బౌలింగ్ దాడి చాలా శక్తిమంతమైనది. ఆ మ్యాచ్‌లో బంతులను ఎదుర్కోవడం సవాలుగా మారింది. అఫ్రిది, సయీద్ అజ్మల్, ఉమర్ గుల్, అజీజ్ చీమా, హఫీజ్‌లకు మొదటి 20 నుంచి 25 ఓవర్ల వరకు పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు సచిన్ చాలా సంతోషంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే అదే అతడి చివరి వన్డే. మాస్టర్ హాఫ్ సెంచరీ చేయడం వల్ల 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాం. అది నాకు ఎప్పటికీ ఓ తీపి జ్ఞాపకంగా ఉండిపోతుంది"
- విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
ఈ ఇన్నింగ్స్‌లో చేసిన బ్యాటింగ్ వల్ల ఆ తర్వాత ప్రపంచంలో ఏ బౌలింగ్‌లోనైనా ఆడగల విశ్వాసం వచ్చిందని కోహ్లీ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం 47.5 ఓవర్లలోనే టీమ్ఇండియా చేధించింది.
ఇదీ చూడండి... 'ధోనీని కొనసాగించాలి.. ఐపీఎల్ కచ్చితంగా జరపాలి'