రికార్డులు బ్రేక్ చేయడం టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి అలవాటే. సగటున ఐదు మ్యాచ్లకు ఓ శతకం సాధిస్తుంటాడు. అత్యంత నిలకడగా ఆడుతూ.. మైదానంలో పరుగుల వరద పారిస్తాడు. అందుకే కొండల్లాంటి రికార్డులు కోహ్లీ ఆటకు కుదేలవుతున్నాయి. ఇటీవల న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన తొలి భారత భారత కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న విరాట్... న్యూజిలాండ్‌తో తొలివన్డేలో మరో ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో అర్ధశతకంతో రాణించాడు. ఇది కెరీర్లో 58వది.
దాదానే వెనక్కి నెట్టి...
భారత సారథిగా అత్యధిక పరుగులు చేసిన వారిలో మూడో స్థానానికి చేరుకున్నాడు కోహ్లీ. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని వెనక్కి నెట్టాడు. కెప్టెన్‌గా గంగూలీ 142 ఇన్నింగ్సుల్లో 5,082 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ వన్డేలో అర్ధశతకం సాధించిన కోహ్లీ.. దాదాను అధిగమించాడు. 5,123 పరుగులతో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇందుకు విరాట్ 83 ఇన్నింగ్స్ మాత్రమే తీసుకున్నాడు.
ఈ జాబితాలో మహ్మద్ ఎంఎస్ ధోనీ 6,641 (172 ఇన్నింగ్స్), అజహరుద్దీన్ 5,239 (162 ఇన్నింగ్స్) కోహ్లీ కంటే ముందున్నారు. గణాంకాలను చూస్తుంటే మహీని అందుకోవడానికి విరాట్ ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.
ఓవరాల్గా ఏడో స్థానంలో..
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ 7వ స్థానంలో నిలిచాడు. ఇందులో ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు.
- రికీ పాంటింగ్(230 మ్యాచ్ల్లో- 8497 పరుగులు)
- మహేంద్ర సింగ్ ధోనీ(200 మ్యాచ్ల్లో- 6641 పరుగులు)
- స్టీఫెన్ ఫ్లెమింగ్(218 మ్యాచ్ల్లో- 6295 పరుగులు)
- అర్జున రణతుంగ(193 మ్యాచ్ల్లో- 5608 పరుగులు)
- గ్రేమ్ స్మిత్(150 మ్యాచ్ల్లో- 5416 పరుగులు)
- మహ్మద్ అజహరుద్దీన్ (174 మ్యాచ్ల్లో- 5239 పరుగులు)
- విరాట్ కోహ్లీ(87 మ్యాచ్ల్లో- 5123 పరుగులు)
- సౌరభ్ గంగూలీ(148 మ్యాచ్ల్లో- 5104 పరుగులు)
ప్రస్తుతం న్యూజిలాండ్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. రెండోది ఫిబ్రవరి 8న ఆక్లాండలో, మూడోది ఫిబ్రవరి 11న మౌంట్ బన్గానే వేదికగా జరగనుంది.