వెస్టిండీస్‌ను ఓడించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఘనంగా బోణి కొట్టింది టీమిండియా. ఆదివారం జరిగిన రెండో టెస్టును 257 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ క్రమంలో భారత్ తరఫున ఈ ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. అదే విధంగా ధోనీని అధిగమించి తన పేరిట పలు రికార్డులు నమోదు చేశాడు.
ఇప్పటి వరకు 48 టెస్టులకు కెప్టెన్సీ వహించిన కోహ్లీ.. 28 విజయాలు సాధించాడు. మొత్తంగా చూస్తే ఇతడి కంటే ముందు ఆస్టేలియాకు చెందిన స్టీవ్ వా(36), రికీ పాంటింగ్(33) ఉన్నారు.
భారత్ కెప్టెన్‌గా అత్యధిక టెస్టు మ్యాచ్‌ల్లో(28) విజయం సాధించింది కోహ్లీనే కావడం విశేషం. ఇతడి తర్వాతి స్థానంలో మాజీ సారథి ధోనీ(27) ఉన్నాడు.
2014 ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు విరాట్ కోహ్లీ. అక్కడి నుంచి అతడి జైత్రయాత్ర మొదలైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో విజయాలు నమోదు చేసి టీమిండియా సక్సెస్ఫుల్ టెస్టు కెప్టెన్‌గా నిలిచాడు.
టెస్టు విజయాల్లో ధోనీ గెలుపు శాతం 45. అతడి సారథ్యంలో భారత జట్టు 45 మ్యాచ్‌లు ఆడగా 27 విజయాలు, 18 ఓటములు, 10 డ్రా అయ్యాయి. అదే కోహ్లీ విషయానికొస్తే 55.31 శాతంగా ఉంది. కెప్టెన్‌గా 48 మ్యాచ్‌లాడిన విరాట్.. 28 విజయాలు, 10 ఓటములు, 10 డ్రాలతో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత సౌరవ్ గంగూలీ 42.85 శాతంతో మూడో స్థానంలో ఉన్నాడు.
విదేశాల్లో జరిగిన టెస్టు సిరీస్‌ల్లోనూ 13 గెలుచుకుని, భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ(11) రికార్డును అధిగమించాడు విరాట్ కోహ్లీ.
ఇదీ చదవండి: భారత్ జోరుకు విండీస్ విలవిల- సిరీస్ కైవసం