Satyam Sundaram 2024 Review : 96 సినిమాతో ఓ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీని మనసులకు హత్తుకునేలా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్. మళ్లీ ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు సత్యం సుందరంతో మరో భావోద్వేగభరిత చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక దంపతులు నిర్మించారు. టీజరు,ట్రైలర్లు కూడా ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ చిత్ర కథేంటి? సినిమా ఎలాంటి అనుభూతిని అందించింది? తెలుసుకుందాం.
కథేంటంటే ? - సత్యమూర్తి అలియాస్ సత్యం(అరవింద్ స్వామి) గుంటూరు దగ్గరున్న ఉద్దండరాయుని పాలెంకు చెందిన వ్యక్తి. అతడికి ఆ ఊరు అన్నా అక్కడ ఉన్న తమ తాతల కాలం నాటి ఇళ్లంటే కూడా ఎంతో ఇష్టం. కానీ కొందరు బంధువులు చేసిన మోసంతో సత్యం యుక్తవయసులోనే అతడి కుటుంబం తమ ఇల్లును కోల్పోతుంది. దీంతో వాళ్లు ఆ ఊరుని వదిలేసి వైజాగ్ వెళ్లిపోతాడు. అలా 30ఏళ్లు కూడా గడిచిపోతాయి. అయితే ఇన్నేళ్లు గడిచినా సత్యంకు తన ఊరు, ఇంటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూనే ఉంటాయి.
ఓసారి తన బాబాయ్ కూతురు పెళ్లి కోసం సత్యం ఉద్దండరాయుని పాలెం వెళ్లాల్సి వస్తుంది. ఆ పెళ్లిలోనే అతడిని బావా అని ఆప్యాయంగా పలకరిస్తూ ఓ వ్యక్తి (కార్తి) కనపడతాడు. నిజానికి అతడెవరు, తన పేరు ఏంటనేది సత్యంకు తెలీదు. కానీ మొహమాటం కొద్దీ తాను గుర్తుపట్టినట్టుగానే నటిస్తాడు. మొదట్లో అతడి అతి వాగుడు, మితిమీరిన కలుపుగోలుతనం చూసి తనను జిడ్డులా భావించిన సత్యం, కలిసి ప్రయాణం చేసే కొద్దీ అతడు చూపే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం మనసును కట్టిపడేస్తాయి. మరి వీరిద్దరి ప్రయాణం ఎక్కడి వరకు సాగింది?, ఈ ప్రయాణంలో సత్యం తనని తాను ఎలా తెలుసుకున్నాడు? అసలు బావా అని పిలుస్తున్న ఆ వ్యక్తితో తనుకున్న బంధం ఏంటి? అన్నదే మిగతా కథ.
ఎలా సాగిందంటే : ఈ కథ ఓ నవల చదువుతున్న అనుభూతి కలిగించింది. చాలా చోట్ల ఆనందభాష్పాలు వస్తాయి. ఈ సినిమా మట్టివాసనలు పులుముకుని, బోలెడన్ని జ్ఞాపకాలు, భావోద్వేగాల్ని నింపుకొన్న ఓ అందమైన జీవిత ప్రయాణంలా సాగింది.
సినిమా ప్రారంభం, సాగిన విధానం, ముగింపు అన్నీ ఓ ప్రశాంతమైన నదిలా సాగిపోతుంది. ఆ ప్రయాణంలో మూడు గంటల పాటు మనల్ని గతంలోకి తీసుకెళ్లిపోయారు దర్శకుడు. మధ్య మధ్యలో కార్తి చేసే కామెడీ సరదాగా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ, కామెడీతో నిండి ఉంటుంది.
సెకండాఫ్‌లో సత్యానికి ఎదురయ్యే అనుభవాలు మనసుల్ని హత్తుకుంటూనే నవ్విస్తాయి. మళ్లీ ప్రేక్షకుల్ని వెనకటి రోజుల్లోకి తీసుకెళ్లిపోతుంది కథ. ప్రతి ఎపిసోడ్ చాలా సేపు మదిని బరువెక్కిస్తుంది. ఇక క్లైమాక్స్‌లో కార్తి పాత్ర పేరును బయట పెట్టే తీరు, తనకు సత్యానికి మధ్య జరిగే ఫోన్ సంభాషణ బాగుంటుంది.
ఎవరెలా చేశారంటే? - కార్తి, అరవింద్ స్వామిలతో పాటు మిగిలిన నటీనటులంతా ఆయా పాత్రల్లో పూర్తిగా జీవించేశారు. తెరపై నిజ జీవిత కథను చూస్తున్నామా అన్నట్లుగా సహజ నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. కార్తి పాత్ర ఓవైపు నవ్విస్తూనే భావోద్వేగ భరితంగా సాగింది. మరోవైపు అరవింద స్వామి సెటిల్ట్‌గా ఒకే మూడ్‌లో కనిపిస్తూ క్లైమాక్స్ సీన్స్‌లో భావోద్వేగ భరితమైన నటనతో ఆకట్టుకున్నారు.
దర్శకుడు ప్రేమ్‌కుమార్ తెరపైకి అద్భుతంగా తీసుకురాగలగడంలో తానేంటో నిరూపించుకున్నాడు. సినిమా నెమ్మదిగా సాగుతున్న అనుభూతి కలిగినప్పటికీ, మొత్తం కథ పరంగా ఆద్యంతం కట్టిపడేసింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా అదనపు ఆకర్షణ. విజువల్స్ కట్టిపడేస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
చివరిగా: సత్యం సుందరం, ఓ అందమైన జీవిత ప్రయాణం!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే