భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు అహ్మదాబాద్ మొతేరా వేదికగా బుధవారం (ఫిబ్రవరి 24) ప్రారంభంకానుంది. టీమ్ఇండియా స్వదేశంలో ఆడబోతున్న రెండో డేనైట్ టెస్టు ఇది. మొత్తం నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికీ ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో ఈ గులాబీ బంతి టెస్టు రెండు జట్లకు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ద్వారా టీమ్ఇండియా ఆటగాళ్లు నెలకొల్పబోయే రికార్డులేంటో చూద్దాం.
- స్వదేశంలో ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్లుగా ప్రస్తుతం ధోనీ (21), కోహ్లీ (21) సమానంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే మహీ రికార్డును తిరగరాసి భారత గడ్డపై జట్టుకు ఎక్కువ టెస్టు విజయాలు అందించిన టెస్టు సారథిగా నిలుస్తాడు విరాట్. ఇక్కడ ధోనీ 30 టెస్టులకు కెప్టెన్సీ చేయగా, కోహ్లీ 28 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు.
- కెప్టెన్‌గా ఎక్కువ సెంచరీలు సాధించిన వారి జాబితాలో ప్రస్తుతం పాంటింగ్ సరసన నిలిచాడు కోహ్లీ. ప్రస్తుతం 41 సెంచరీలతో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో శతకం సాధిస్తే పాంటింగ్‌ను దాటి వెళతాడు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన డేనైట్ టెస్టు తర్వాత ఇప్పటివరకు కోహ్లీ ఒక్క సెంచరీ సాధించలేకపోయాడు.
- భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో ఎక్కువ టెస్టు సెంచరీలు సాధించిన జాబితాలో ముందున్నారు అజారుద్దీన్, కెవిన్ పీటర్సన్. వీరిద్దరూ 6 శతకాలు సాధించారు. ప్రస్తుతం ఐదు సెంచరీలు చేసిన కోహ్లీ మరో శతకం బాదితే వీరి సరసన చేరతాడు. పుజారా కూడా ఐదు సెంచరీల వద్ద ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్, అలిస్టర్ కుక్ ఏడు శతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
- స్వదేశంలో ఇంగ్లాండ్‌పై 1000 పరుగులు సాధించిన మూడో టీమ్ఇండియా క్రికెటర్‌గా నిలవడానికి మరో 12 రన్స్ దూరంలో ఉన్నాడు కోహ్లీ. సునీల్ గావస్కర్ (1331), గుండప్ప విశ్వనాథ్ (1022) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
- అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలవడానికి మరో శతకం దూరంలో ఉన్నాడు కోహ్లీ. ప్రస్తుతం కోహ్లీ 70 శతకాలతో పాంటింగ్ (71) తర్వాత స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ 100 శతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
- 400 టెస్టు వికెట్ల క్లబ్లో చేరడానికి మరో ఆరు వికెట్ల దూరంలో ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. 76 టెస్టుల్లో ప్రస్తుతం 394 వికెట్లు సాధించాడు అశ్విన్. ఒకవేళ ఈ మ్యాచ్‌తో 400 వికెట్ల క్లబ్లో చేరితే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా నిలుస్తాడీ టీమ్ఇండియా స్పిన్నర్. మురళీధరన్ 72 టెస్టుల్లో ఈ ఘనత సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు.
- అలాగే మరో 6 వికెట్లు సాధిస్తే 400 వికెట్ల క్లబ్లో చేరిన నాలుగో భారత బౌలర్‌గా ఘనత వహిస్తాడు అశ్విన్. హర్భజన్ సింగ్ (417), కపిల్ దేవ్ (434), అనిల్ కుంబ్లే (619) ముందున్నారు.
- టీమ్ఇండియా పేసర్ ఇషాంత్ శర్మకు ఇది 100వ టెస్టు. ఈ ఘనత సాధించబోతున్న 11వ భారత బౌలర్ ఇషాంత్. ఇప్పటివరకు సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ, కుంబ్లే, హర్భజన్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్, సునీల్ గావస్కర్, సెహ్వాగ్ ఈ ఘనత సాధించారు.