టీమిండియాకు వన్డేల్లో అతిపెద్ద సమస్యగా మారిన నాలుగో స్థానం విషయంపై స్పందించాడు కొత్త బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్. వన్డేల్లో నాలుగో స్థానం, టెస్టుల్లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఎంపిక తన ముందున్న తక్షణ కర్తవ్యమని చెప్పాడు.
"ప్రపంచకప్‌లో మిడిలార్డర్ సమస్య ఇబ్బంది పెట్టింది. ఇటీవలే విండీస్ సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ మంచి ప్రదర్శన కనబర్చాడు. మనీశ్ పాండే ఈ స్థానంలో సత్తాచాటాగలడని భావిస్తున్నాం. వీరిద్దరూ దేశవాళీతో పాటు భారత్-ఏ తరఫున మంచి ప్రదర్శన చేస్తున్నారు. మనీశ్, అయ్యర్‌లకు మంచి అవకాశాలు కల్పిస్తే వారు రాణించగలరు". -విక్రమ్ రాఠోడ్, టీమిండియా బ్యాటింగ్ కోచ్
వెస్టిండీస్ పర్యటనలోని రెండు టెస్టుల్లోనూ ఓపెనింగ్ జోడి మయాంక్ అగర్వాల్-రాహుల్ అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఈ విషయంపైనా మాట్లాడాడు విక్రమ్.
"వన్డేల్లో నాలుగో స్థానంతో పాటు టెస్టుల్లో ఓపెనింగ్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఈ స్థానానికి ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఎక్కువ స్థిరంగా ఎవరు ఆడగలరో గుర్తించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాం". -విక్రమ్ రాఠోడ్, టీమిండియా బ్యాటింగ్ కోచ్
త్వరలో జరిగే దక్షిణాఫ్రికా సిరీస్‌తో బ్యాటింగ్ కోచ్‌గా సేవలు ప్రారంభించనున్నాడు విక్రమ్. ఇందులో భాగంగా మూడు టీ20లు, మూడు టెస్టులు ఆడనుంది టీమిండియా.
ఇవీ చూడండి.. సచిన్‌ను వెనక్కి నెట్టిన స్మిత్... లిటిల్ మాస్టర్ స్పందన