భారత పర్యటనకు రానున్న ఇంగ్లాండ్.. ఫిబ్రవరి 5 నుంచి టెస్టులతో సిరీస్‌ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా తొలి రెండు మ్యాచులు చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో జరగనున్నాయి. అయితే ఈ వేదికపై ముఖాముఖిలో భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఓ సారి ఆ రికార్డులను పరిశీలిద్దాం.
ఈ మైదానంలో భారత్-ఇంగ్లాండ్ టెస్టుల్లో తొమ్మిదిసార్లు తలపడగా.. టీమ్ఇండియా ఐదు సార్లు, ఇంగ్లీష్ జట్టు మూడు సార్లు గెలిచింది. 1982లో జరిగిన ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
చివరిసారిగా 2016లో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్‌పై ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. ఈ మ్యాచులో భారత ఆటగాడు కరుణ్ నాయర్.. టెస్టు క్రికెట్లో మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ బాదిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు.
మొత్తంగా ఈ స్టేడియంలో టీమ్ఇండియా 32 టెస్టులు ఆడగా.. 14 గెలిచి, ఆరింట ఓడింది. 11 డ్రాగా ముగిశాయి. 1986లో ఆస్ట్రేలియాపై ఆడిన మ్యాచ్ టై అయింది.
తొలిసారి..
1934లో తొలిసారి ఇరుజట్ల మధ్య చెన్నైలో మ్యాచ్ జరగగా.. భారత్ ఓడిపోయింది. సీకే నాయుడు సారథ్యంలోని టీమ్ఇండియా 202 పరుగుల భారీ తేడాతో ఓటమి చెందింది.
ఇప్పుడు.. ఫిబ్రవరి 5-9 మధ్య తొలి, 13-17 మధ్య రెండో టెస్టుకు చెన్నైనే వేదిక.
షెడ్యూల్ ఇదే
భారత పర్యటనలో ఇంగ్లాండ్ నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలుత ఫిబ్రవరి 5న జరిగే టెస్టుతో పర్యటన ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనుండగా, మూడోదైన డేనైట్ టెస్టుతో పాటు నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. తర్వాత టీ20 పోరు కోసం సిద్ధమవనున్నాయి ఇరుజట్లు. 28న జరిగే వన్డేతో ఇంగ్లాండ్ పర్యటన పూర్తి కానుంది.
ఇదీ చూడండి: 27న భారత్‌కు ఇంగ్లాండ్ జట్టు.. నేరుగా క్వారంటైన్‌కు