టీమ్ఇండియా ప్రస్తుత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ప్రశంసించాడు. ఉత్తమ క్రికెటర్లు జట్టులో ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇప్పుడున్న బౌలింగ్ టెక్నిక్‌తో ప్రపంచంలోనే అత్యుత్తమంగా తయారు కావాల్సిన అవసరముందని సూచించాడు.
"బౌలర్లకు వేగం, ఫిట్నెస్, స్వింగ్ తదితర వైవిధ్యాలెన్నో ఉన్నాయి. బంతులను పేస్, యార్కర్, బౌన్సర్ ఇలా రకరకాలుగా సంధించగలరు. టీమ్ఇండియాలో ప్రస్తుతం ఉత్తమ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని నా అభిప్రాయం. నాకు తెలిసి జట్టులో ఐదు నుంచి ఆరుగురు మంచి బౌలర్లు ఉన్నారు. జట్టు కేవలం ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడి ఉంటుందని అనుకోను. ప్రతి ఒక్కరిలోనూ అపారమైన ప్రతిభ దాగుంటుంది"
-వెంకటేశ్ ప్రసాద్, భారత మాజీ క్రికెటర్
కెప్టెన్‌గా బ్యాట్స్‌మెన్ ఉన్న ట్రెండ్‌పైనా ప్రసాద్ స్పందించాడు. బౌలింగ్‌తో పాటు ప్రాతినిధ్యం వహించిన కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలు అరుదైన క్రికెటర్లలో కొందరని చెప్పాడు. బౌలర్లకు మైదానంలో ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల వారిని ఎక్కువగా కెప్టెన్లుగా నియమించలేదని అభిప్రాయపడ్డాడు. నాయకత్వ లక్షణాలుంటే ఎవరైనా సరే సారథి అవుతారని స్పష్టం చేశాడు.