2023లో జరగబోయే ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి యూఎస్ఏ క్రికెట్ బోర్డు ఆసక్తి వ్యక్తం చేస్తోంది. దక్షిణాసియాకు చెందిన ప్రజలు అమెరికాలో ఎక్కువగా ఉండటం వల్ల వారు ఈ టోర్నీని నిర్వహించడానికి ముందుకొచ్చారని తెలుస్తోంది.
గతంలో బేస్ బాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్‌తో పోల్చితే సాకర్‌కు ఆ దేశంలో తక్కువ ప్రజాదరణ ఉన్నప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1994లో ఫిఫా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. ఈ టోర్నీని అప్పట్లో దాదాపుగా 35 లక్షల మంది వీక్షించారు.
"మీరు యూఎస్ఏలో ఆడితే ప్రతి స్టేడియం ప్రేక్షకులతో నిండిపోతుంది. భారత్, పాకిస్థాన్ లాంటి దేశాల మధ్య క్రికెట్ టోర్నీని నిర్వహించడానికి అమెరికా కంటే పెద్ద వేదిక ఎక్కడ ఉంటుంది. అలాంటి మ్యాచ్‌లకు తటస్థ వేదికగా ఎంచుకుంటే ఇరు జట్లను సంతృప్తి పరచగలమనే నమ్మకం మాకు ఉంది. రాబోయే పదేళ్లలో ఐసీసీలో శాశ్వత సభ్యులై ఉండాలన్నది మా ప్రధాన లక్ష్యం."
-ఇయాన్ హిగ్గిన్స్, అమెరికా క్రికెట్ సీఈఓ
ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ ఇప్పటికే 6 వన్డేలు, పది టీ20లకు ఆతిథ్యం ఇచ్చింది. అదే స్టేడియంలో ఆగస్టులో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను నిర్వహించనున్నారు. దీంతో ఐసీసీ నిర్వహించే పెద్ద టోర్నీలతో సహా కొన్ని దేశాలకు తటస్థ వేదికగా ఉండటానికి ఆసక్తి చూపారు.
అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించడానికి కనీసం 6 వేదికలను సిద్ధం చేయాలని ప్రణాళిక చేస్తున్నట్లు హెగ్గిన్స్ తెలిపారు. గతేడాది డిసెంబర్లో స్కాట్లాండ్ను ఓడించి అమెరికా అంతర్జాతీయ జట్టు హోదాను పొందింది.
ఇదీ చూడండి... 'కోహ్లీ, రోహిత్ వన్డే స్వరూపాన్నే మార్చేశారు'