ఐసీసీ వన్డే ప్రపంచకప్-2011ను భారత్‌కు అమ్మేశామంటూ శ్రీలంక క్రీడాశాఖా మాజీమంత్రి మహిందానంద ఆల్తుగమాగె చేసిన ప్రకటన ప్రకంపనలు ఇప్పట్లో చల్లారేలాగా లేవు. ఇటీవల ఈ అంశంపై విచారణ ప్రారంభించిన అక్కడి ప్రభుత్వం.. ఆ ప్రపంచకప్‌లో వరుసగా ఆడిన ఆటగాళ్లను విచారిస్తూ దర్యాప్తు ముమ్మరం చేసింది.
తాజాగా శ్రీలంక క్రికెటర్ ఉపుల్ తరంగను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఫిక్సింగ్‌కు సంబంధించిన అనేక ప్రశ్నలను అడిగి.. అతడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు అధికారులు. జులై 2వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ఆ ప్రపంచకప్‌కు సారథిగా వ్యవహరించిన మాజీ లంక ఆటగాడు సంగక్కర విచారించనున్నారు.
ఇప్పటికే లంక మాజీ క్రికెటర్, ప్రపంచకప్ సమయంలో సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న అరవింద డిసిల్వాను పోలీసులు ఆరు గంటల పాటు విచారించారు. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు.
జూన్ 15న ఆల్తుమాగె ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు. ఇందులో ఆటగాళ్ల ప్రమేయం మాత్రం లేదన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను లంక మాజీ క్రికెటర్లు ఖండించారు. 'ఎన్నికలేమైనా ఉన్నాయా... మళ్లీ సర్కస్ మొదలైంది' అంటూ సంగక్కర, దిల్షాన్ విమర్శించారు. ప్రస్తుతం ఆల్తుమాగె మరో శాఖకు మంత్రిగా పనిచేస్తున్నారు.
ఇది చూడండి : వైద్యుల సేవలకు భారత క్రికెటర్లు సలాం