భారత్-పాకిస్థాన్ మధ్య 1999లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో.. భారీ కాంట్రాక్ట్ వదులుకున్నట్లు వెల్లడించాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. నాటింగ్‌హామ్‌షైర్ తరఫున ఆడేందుకు చేసుకున్న రూ.1.71 కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకొని.. యుద్ధంలో పాల్గొనేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. ఆ సమయంలో దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధమైనట్లు స్పష్టం చేశాడు.
" నేను లాహోర్ సరిహద్దుల్లో ఉన్నాను. ఓ ఆర్మీ జనరల్ వచ్చి నువ్విక్కడ ఏం చేస్తున్నావ్? అని అడిగారు. మనిద్దరం కలిసి చనిపోబోతున్నాం అని అతనికి చెప్పా. యుద్ధం సమయంలో రెండుసార్లు క్రికెట్‌ను వదిలేశాను. నాటింగ్హామ్తో రూ.1.71 కోట్ల కాంట్రాక్ట్ సహా మరో పెద్ద ఆఫర్‌ను కార్గిల్ సమయంలో వదులుకున్నా. అప్పుడు ఆయా కౌంటీలు షాక్ అయ్యాయి"
-- షోయబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్.
పాకిస్థాన్‌లోని తన స్నేహితులకు ఫోన్ చేసి.. యుద్ధంలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు అక్తర్ వెల్లడించాడు.
క్రీడలు, రాజకీయాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు తెలిపే అక్తర్.. కరోనాతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చడానికి భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించాలని అభిప్రాయపడ్డాడు. అయితే ఆ సూచనను కపిల్‌దేవ్ అంగీకరించలేదు. ఇరుదేశాల మధ్య మ్యాచ్ ఆప్షన్ కాదని స్పష్టం చేశారు.
కార్గిల్ యుద్ధం సమయంలో దాదాపు 16 వేల అడుగుల ఎత్తైన ప్రాంతంలో భారత్, పాక్ సైన్యాలు తలపడ్డాయి. ఈ పోరులో 1,042 మంది పాక్ అధికారులు చనిపోయారు. భారత్‌కు చెందిన 527 మంది సైనికులు యుద్ధంలో వీరమరణం పొందారు.