లాక్డౌన్ ముగిశాక లయ అందుకోవడం బౌలర్లకు కష్టమవుతుందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ అన్నాడు. ఏ ఫార్మాటైనా సరే ఫిట్నెస్ సాధించేందుకు కనీసం ఎనిమిది వారాల సమయం పడుతుందని అంచనా వేశాడు. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లో లయ అందుకోవడం ఎవరికి కష్టంగా మారుతుందని ప్రశ్నించగా ఇద్దరికీ కష్టమేనని లీ అన్నాడు.
"ఫామ్ అందుకోవడానికి బౌలర్లకు మరికొంత ఎక్కువ సమయం పట్టొచ్చు. మునుపటిలా పూర్తి స్థాయిలో వేగం అందుకోవాలంటే సాధారణంగా 6-8 వారాలు పడుతుంది. టెస్టు, వన్డే.. ఫార్మాట్ ఏదైనా మ్యాచ్ ఫిట్‌నెస్‌కు ఎనిమిది వారాలు అవసరం. బౌలర్లకు కాస్త కష్టంగానే ఉంటుంది"
-బ్రెట్ లీ, ఆస్ట్రేలియా మాజీ పేసర్.
కరోనా వైరస్ ముప్పుతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ వాయిదా పడింది. ఆటను తిరిగి ఎలా ఆరంభించాలా అని అన్ని దేశాల బోర్డులు, ఐసీసీ మల్లగుల్లాలు పడుతున్నాయి. స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించకుండా పునః ప్రారంభం చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఇంగ్లాండ్ పేసర్లు స్టువర్ట్ బ్రాడ్, క్రిస్‌వోక్స్ తమ కౌంటీ మైదానాల్లో వ్యక్తిగతంగా సాధన చేస్తున్నారు. భారత్‌లో బీసీసీఐ కాంట్రాక్టున్న వారిలో శార్దూల్ ఠాకూర్ ఒక్కడే శనివారం శిక్షణ ఆరంభించాడు.
ఇదీ చూడండి : 'అక్తర్ వేసిన బౌన్సర్లకు సచిన్ భయపడ్డాడు'