ముంబయితో జరిగిన రంజీ మ్యాచ్‌లో రైల్వేస్ ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సంగ్వాన్ అత్యుత్తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముంబయి రెండో ఇన్నింగ్స్‌లో పృథ్వీషా, అజింక్య రహానే లాంటి మేటి బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు చేర్చడమే కాకుండా మరో నలుగురిని ఔట్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రైల్వేస్‌లో టికెట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సంగ్వాన్ ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో కొద్దికాలం శిక్షణ తీసుకున్నాడు.
ఈ సమయంలో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఆధ్వర్యంలో సంగ్వాన్ మెలకువలు నేర్చుకొని రైల్వేస్ తరఫున రాణిస్తున్నాడు. తన ప్రతిభకు కారణం మెక్‌గ్రాత్ అని, అతను తన రోల్‌మోడల్ అని హిమాన్షు చెప్పుకొచ్చాడు.
"ఎంఆర్‌ఎఫ్ శిక్షణా శిబిరానికి నేను మార్చిలో వెళ్లా. అక్కడ మెక్‌గ్రాత్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. నా బౌలింగ్ వీడియోలు చూసి ఎక్కడ మెరుగుపడాలో సూచించాడు. క్రికెట్‌లో అతనో లెజెండ్. అయితే నాకు ఒకే విషయం చెప్పాడు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రాథమిక అంశాలనే పాటించమని సూచించాడు. మెక్‌గ్రాత్ నేతృత్వంలో చాలా సాధన చేశా. నేను బౌలింగ్ చేసే విధానాన్ని నోట్ చేసేవాడు. ప్రతి సెషన్ అయిపోయాక నాలో ప్రేరణ కలిగించి సాంకేతిక అంశాలు నేర్పించేవాడు"
-- హిమాన్షు సంగ్వాన్, క్రికెటర్
రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులు చేసిన ముంబయి... రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులు చేసింది. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేయడం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో మరో 47 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.