మహమ్మారి కబుర్లతో విసిగివేసారి పోయిన మనస్సులకు ఆటల్లో ఉండే మజాను పరిచయం చేసింది ఐపీఎల్. వాస్తవానికి దాని పేరు ఇండియన్ ప్రీమియర్ లీగ్. కానీ, పరిస్థితుల ప్రభావంతో ఎడారి దేశాన్ని వేదికగా చేసుకుని.. ఒయాసిస్‌లా జీవం పోసింది. ఎన్ని మ్యాచ్‌లు.. ఎన్ని మలుపులు.. ఎన్నెన్ని పోరాటాలు. నరాలను స్ట్రింగ్స్లా మార్చి వయొలిన్, గిటార్ ఏకకాలంలో ప్లే చేస్తే ఎలా ఉంటుందో అలా సాగాయి చాలా మ్యాచ్‌లు.
ఇదే ది బెస్ట్..
అసలు ఓ రోజు, ఓ మ్యాచ్‌లో ఓ సూపర్ ఓవర్ చూడటమే ఎక్కువ అనుకుంటే రెండు, మూడు అంటూ నెంబర్లు పెంచుకుంటూ సూపర్ ఓవర్లే మ్యాచ్ల్లా తయారవుతుంటే ఏ క్రికెట్ ప్రేమికుడు కుదురుగా కూర్చోగలడు? సీనియర్లు తమ అనుభవాన్ని రంగరిస్తూ జట్లకు వెన్నెముకలా మారితే..జూనియర్లు సాహసమే శ్వాస అన్నట్లు చెలరేగిపోయారు. ఇక ఈ పోరాటాలకు అడ్డుకట్ట పడేది ఎక్కడ? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఇప్పటి వరకూ జరిగిన ఐపీఎల్ సీజనల్లో ఇదే ఉత్తమమైందని అభివర్ణించవచ్చు.
అందుకే ముంబయికి..
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్.. టోర్నీ మొత్తంలో నిలకడగా ఆడిన ఏకైక జట్టు. అందుకే.. రోహిత్ సేన దిగ్విజయంగా ఐదో సారి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. కానీ, అదే సమయంలో కుర్రాళ్లతో అద్భుతాలు చేసిన దిల్లీ, పంజాబ్ ప్రదర్శనలను తీసి పారేయలేం. ఆర్సీబీకి ఎప్పటిలానే అదృష్టం కలిసిరాక కీలక మ్యాచ్‌లో తేలిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఉన్నంతలో అభిమానులను బాగానే ఆకట్టుకున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కెప్టెన్‌గా విఫలమయ్యాడు ధోనీ, తన సారథ్యంలోని చెన్నై, స్టీవ్ స్మిత్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ పూర్తిగా నిరాశపరిచాయి.
కుర్రాళ్ల జోరు..
అన్ని జట్లలోనూ యువ ఆటగాళ్లు తమకి వచ్చిన అవకాశాలను రెండు చేతులా ఒడిసిపట్టుకున్నారు. ఇషాన్ కిషన్, దేవదత్ పడిక్కల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, రుతురాజ్ గైక్వాడ్, వరుణ్ చక్రవర్తి, నటరాజన్, తెవాతియా, రియాన్ పరాగ్, సామ్ కరన్.. ఇలా ఒకరా ఇద్దరా తమకు అవకాశం వచ్చినప్పుడల్లా చెలరేగిపోయారు కుర్రాళ్లంతా. అందుకే ఈ ఐపీఎల్ కుర్రాళ్ల ఐపీఎల్‌గా గుర్తుండిపోతుంది.
సీనియర్ల విన్యాసాలు..
సీనియర్లు ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, ఏబీ డివీలియర్స్, కేన్ విలియమ్సన్ లాంటి ఆటగాళ్లు తమ అనుభవంతో చాలా మ్యాచ్‌లను గట్టున పడేశారు. టీ20 మజాను పరిచయం చేసేలా చివరి ఓవర్లలో వరుస సిక్సులు, సూపర్ ఓవర్లు, కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు, సహచరుల్లో ఉత్సాహాన్ని నింపేలా డ్యాన్సులు.. ఇలా ఈ ఐపీఎల్‌కి ప్రత్యేకంగా నిలిచే దృశ్యాలు ఎన్నో ఆవిష్కృతమయ్యాయి.
సాంత్వన చేకూర్చేలా..
అన్నింటికంటే ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రభావంతో అల్లాడిపోతున్న ఈ ప్రపంచానికి కొంతలో కొంత సాంత్వన చేకూర్చేలా జరిగింది ఈ ఐపీఎల్. ఈ ఆటతో వచ్చిన అనుభవాలు ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. ఖాళీ స్టేడియాల్లో అభిమానులు లేకుండానే జరపాల్సి వస్తోందనే నిర్వాహుకుల అనుమానాలను పటాపంచలు చేసేసింది ఈ ఐపీఎల్. గత ఎడిషన్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో వినోదాన్ని, అంతకు మించిన ఉత్సాహాన్ని అందించింది.. అలరించింది. పరిస్థితులు మళ్లీ చక్కబడతాయనే ఆశావాహ దృక్పథంతో పోరాడాలనే భరోసానూ కల్పించింది.
ఇదీ చూడండి:ఐపీఎల్ తుదిపోరు.. రికార్డులతో హిట్ మ్యాన్ జోరు