అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్రోటీస్ ఆటగాళ్లలో క్వింటన్ డికాక్ ఒకడిగా నిలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ మార్క్ బౌచర్. ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు.. డికాక్‌కు 50వ మ్యాచ్. సుదీర్ఘ ఫార్మాట్లో మరో 100 టెస్టులు అతడు ఆడాలని బౌచర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ప్రతి ఒక్క ఆటగాడికి ఇదొక ప్రత్యేక సందర్భం. ఇది అతని కెరీర్ ఆరంభం మాత్రమే. మరో 100 టెస్టులు ఆడాలని కోరుకుంటున్నా. క్విన్నీ ప్రత్యేక ఆటగాడు. తమ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. అందుకే.. ప్రత్యర్థి జట్లు అతడు ఫామ్‌లో ఉండొద్దని కోరుకుంటాయి.
-మార్క్ బౌచర్, దక్షిణాఫ్రికా హెడ్ కోచ్.
కెప్టెన్‌గా డికాక్‌పై అదనపు బాధ్యతలు ఉన్నాయని బౌచర్ చెప్పుకొచ్చాడు. ఆ ఒత్తిడిని తగ్గించడానికి తాము ప్రయత్నిస్తుంటామన్నాడు. కానీ, అతడి కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఆనందంగా ఉందని తెలిపాడు.
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా రాణించిన బౌచర్.. ప్రస్తుతం ఆ టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తన టెస్టు కెరీర్‌ను 1997లో పాకిస్థాన్‌పైనే ప్రారంభించినట్లు పేర్కొన్నాడు. కలిస్(166) తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు బౌచరే(150) కావడం విశేషం.
ఇదీ చదవండి: 'టీమ్ఇండియా పోరాట స్ఫూర్తికి కారణం కోహ్లినే'