ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్ సంజయ్ మిత్తల్ బుమ్రా బౌలింగ్‌పై పరిశోధన చేశారు. జస్ప్రిత్ బౌలింగ్‌లో రివర్స్ మ్యాగ్నస్ ఫోర్స్ కలిగి ఉండటమే ఉత్తమ బౌలింగ్‌కు సహకరిస్తున్నట్లు వెల్లడించారు.
" బంతిని కిందికి నొక్కిపెట్టేలా వేగంగా బౌలింగ్ చేయడం వల్ల బ్యాట్స్‌మెన్ త్వరగా ఆ బంతిని ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడతాడు" అని మిత్తల్ తెలిపారు.
1000 ఆర్పీఎమ్ ( రొటేషన్ పర్ మినిట్)తో 0.1 శాతం బంతిని స్పిన్ చేయడం అతడి సొంతం. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతిని కచ్చితంగా అనుకున్న ప్రదేశంలో సంధించగల బౌలర్ బుమ్రా. బంతిని స్పిన్ చేస్తూ రివర్స్ మ్యాగ్నస్ ఫోర్స్‌తో బ్యాట్స్మెన్లను హడలెత్తిస్తున్నట్లు మిత్తల్ పేర్కొన్నారు.
వేగంగా బంతులేయడం, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ , ఎటువైపైనా స్వింగ్ చేయడంలో బుమ్రా దిట్ట. అతడి బౌలింగ్ వేగానికి 'రివర్స్ మ్యాగ్నస్ ఫోర్స్' తోడవడం వల్ల బ్యాట్స్‌మెన్ తొందరగా ప్రతిస్పందించేందుకు అవకాశం ఉండదు. అంతేకాకుండా బంతి వేశాకా వేగంగా ముందుకు కచ్చితత్వంతో కదలాలి. దీనివల్లే క్యాచ్‌లు, రనౌట్ వంటి అవకాశాలు ఏర్పడతాయి. ఇవే బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడానికి బాగా సహకరిస్తాయి. అందుకే వేగంగా స్పందించే బౌలర్లలో బుమ్రా ఒకడనే పేరు వచ్చింది. కొత్త బంతితో రివర్స్ స్వింగ్ వేయగలడు. ఇవే బుమ్రాను ప్రస్తుత క్రికెట్లో అత్యుత్తమ బౌలర్‌గా మార్చాయనేది ప్రొఫెసర్ వాదన.
ప్రస్తుతం బుమ్రా వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో ముంబయి తరఫున ఆడి ఆ జట్టు నాలుగో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 77 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ అహ్మదాబాద్ ఆటగాడు 82 వికెట్లు తీశాడు. 49 వన్డేల్లో 85 వికెట్లు, 10 టెస్టుల్లో 49 వికెట్లు, 42 టీ20ల్లో 51 వికెట్లు సాధించాడు.