ప్రస్తుతం పాక్ జట్టులో ఉన్న కొందరు బౌలర్ల వయసు, ధ్రువపత్రాల్లో ఉన్నదాని కంటే ఎక్కువే ఉంటుందని ఆ దేశ మాజీ పేసర్ మహ్మద్ ఆసిఫ్ చెప్పాడు. చాలాసేపు బౌలింగ్ చేయలేకపోవడం, చురుకుగా పరుగెత్తలేకవడమే ఇందుకు ఉదాహరణ అని అన్నాడు. కమ్రన్ అక్మల్‌తో యూట్యూబ్ షోలో మాట్లాడుతూ వారిపై తీవ్ర విమర్శలు చేశాడు.
"మ్యాచ్‌లో ఓ ఫాస్ట్ బౌలర్ 10 వికెట్లు తీసి, ఐదారేళ్లు కావస్తోంది. ఈ పిల్లలకు తెలివి లేదు. బ్యాట్స్‌మెన్‌ను ఫ్రంట్‌ఫుట్‌పై ఉంచి, ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా వికెట్లు తీయడం తెలియదు. వారు వికెట్లు మీదకు విసిరితే బాల్ లెగ్ సైడ్ వెళ్తోంది. వారిపై వారికే నియంత్రణ లేదు. వాళ్లకు చాలా వయసైపోయింది. పత్రాలపై 17-18 ఏళ్లని ఉన్నప్పటికీ నిజానికి 27-28 సంవత్సరాలు ఉంటాయి. 20-25 ఓవర్లు బౌలింగ్ వేసే శక్తి వాళ్లకు లేదు. శరీరాన్ని ఎలా వంచాలో తెలీదు. 5-6 ఓవర్లు వేయగానే అలిసిపోయి, గ్రౌండ్లో నిలబడలేకపోతారు" అని ఆసిఫ్ అన్నాడు.
కెరీర్లో కనీసం 40-50 దేశవాళీ మ్యాచ్‌లైన ఆడాలని, అలసిపోయిన శరీరాన్ని మరుసటి రోజుకు ఎలా సిద్ధం చేయాలో పాక్ క్రికెటర్లకు తెలిసుండాలి అని ఆసిఫ్ వ్యాఖ్యానించాడు. 10-12 ఓవర్లు వేశామా.. జట్టులో స్థానం సంపాదించమా అన్నట్లుగా ఇప్పటి ఆటగాళ్లు ఉన్నారని విమర్శించాడు. న్యూజిలాండ్‌తో ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతున్న పాక్.. తొలి టెస్టులో ఓడిపోయింది.
ఇదీ చూడండి: భారత క్రికెటర్ల హోటల్ బిల్ కట్టిన అభిమాని