మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మరో విదేశీ లీగ్‌కు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా 'ది హండ్రెడ్ క్రికెట్ లీగ్'లో పేరు నమోదు చేసుకున్నాడు. తాజాగా ఈ అంశంపై మాట్లాడిన యువీ.. భారత్‌లోని టీ20 లాగే ఈ 100 బంతుల క్రికెట్ ఆదరణ పొందుతుందని అన్నాడు.
" 100 బంతుల ఫార్మాట్లో ఆడాలని చాలా ఉత్సాహంతో ఉన్నా. ఇది టీ20 లాగే మంచి ప్రజాదరణ పొందుతుంది." అని యువీ అభిప్రాయపడ్డాడు.
ఇటీవల గ్లోబల్ కెనడా టీ20 లీగ్‌లో పాల్గొన్న ఈ స్టార్ క్రికెటర్.. శుక్రవారం(నవంబర్ 15) అబుదాబి వేదికగా జరిగిన టీ10 లీగ్‌లోనూ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో 6 పరుగులకే ఔటయ్యాడు.
సరికొత్త లీగ్...
'ది హండ్రెడ్' అనేది వంద బంతుల క్రికెట్ లీగ్. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఈ టోర్నీని నిర్వహిస్తోంది. 2020 జులైలో తొలి సీజన్ ఆరంభంకానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఎనిమిది ఫ్రాంఛైజీలు పాల్గొంటుండగా, ప్రతి జట్టుకు ముగ్గురు మాత్రమే విదేశీ ఆటగాళ్లను అనుమతించారు.
ఇందులో ఒక ఇన్నింగ్స్‌లో 100 బంతులు వేస్తారు. ఒక ఓవర్‌లో 10 బంతులు వేస్తారు. ఐదుగురు బౌలర్లు, ఒక్కొక్కరు గరిష్ఠంగా 20 బంతులు విసిరేందుకు అవకాశం ఉంటుంది.