వాషింగ్టన్ సుందర్.. ఈ పేరు వినగానే ఎవరైనా కొద్దిసేపు ఆలోచించి ఇదేం పేరబ్బా అని కచ్చితంగా అనుకుంటారు! అసలు అలా ఎలా పెట్టారని ఆలోచిస్తారు. అయితే ఈ పేరు వెనకాల ఓ హృద్యమైన కథ ఉంది.
వాషింగ్టన్ సుందర్ వాళ్ల నాన్న ఎమ్.సుందర్. ఆయన కూడా క్రికెటర్. కానీ పేదరికం కారణంగా ఆటలో కొనసాగలేకపోయారు. అప్పుడే పొరుగునే ఉండే ఆర్మీ మాజీ అధికారి పీడీ వాషింగ్టన్.. ఆయనకు ఆర్థికంగా సాయం చేసేవారు.
తన చదువుకు ఫీజు కట్టడం, యూనిఫామ్, పుస్తకాలు కొనివ్వడం, గ్రౌండ్‌కు సైకిల్‌పై తీసుకెళ్లడం లాంటివి చేసేవారు. క్రికెట్‌పైన మక్కువతో వీరు ఆడే ఆటను ఇష్టంగా చూసేవారు వాషింగ్టన్.
ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్ర స్థాయి వరకు ఆడాడు ఎమ్.సుందర్. అందులో వాషింగ్టన్ పాత్ర ఎంతో ఉంది. అందుకు కృతజ్ఞతగా ఆయన జ్ఞాపకార్థంగా, తన తొలిబిడ్డకు వాషింగ్టన్ పేరు పెట్టుకున్నారు ఎమ్.సుందర్.
1999లో వాషింగ్టన్ సుందర్ పుట్టడానికి కొన్ని నెలల ముందే పీడీ వాషింగ్టన్ చనిపోయారు. తనకు ఇంకో కొడుకు పుట్టి ఉంటే అతడికి జూనియర్ వాషింగ్టన్ అని పెట్టేవాడినని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఎమ్. సుందర్.
ఇదీ చూడండి: చూడకుండానే సిక్స్ కొట్టిన సుందర్