భారత మాజీ కెప్టెన్, ఝార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీకి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సముచిత గౌరవాన్ని కల్పించింది. తన అధికారిక వెబ్సైట్లలో #ThankYouMSDhoni అంటూ ఫొటోలు పెట్టి, అతడి సేవల్ని మరోసారి గుర్తు చేసుకుంది.
త్వరలో ఆస్ట్రేలియా పర్యనటకు టీమ్ఇండియా వెళ్లనున్న నేపథ్యంలోనే ఈ ఫొటోలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్లో భాగంగా యూఏఈలో భారత క్రికెటర్లు.. సీజన్ పూర్తవగానే అటునుంచి అటే కంగారూ దేశానికి వెళ్లనున్నారు. నవంబరు 27 నుంచి జనవరి 19 వరకు వన్డేలు, టీ20, టెస్టులు ఆడనున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 15న ఐపీఎల్ మినహా అన్ని ఫార్మాట్లకు మహీ వీడ్కోలు పలికాడు. కానీ అంతకు 16 నెలలు ముందు నుంచే, అంటే ప్రపంచకప్ తర్వాతి నుంచి జాతీయ జట్టుకు ధోనీ దూరంగా ఉన్నాడు. ఐపీఎల్లో సత్తా చాటి, తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటాడు అని అభిమానులు అనుకుంటున్న తరుణంలో.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
భారత్ క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీది ప్రత్యేక స్థానం. జట్టు నాయకుడుగా అతడు సాధించిన విజయాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. 200 వన్డేలకు, 72 టీ20లకు, 60 టెస్టులకు సారథ్యం వహించిన మహేంద్రుడు.. 332 అంతర్జాతీయ మ్యాచులకు సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా రికార్డులు సృష్టించాడు. వన్డేల్లో పాంటింగ్(172) తర్వాత అత్యధిక విజయాలు(151) నమోదు చేసిన సారథిగా రికార్డు సృష్టించాడు. 50.57 సగటుతో వన్డేలలో 10,773 పరుగులు చేసి.. చివరి ఓవర్లలో ఎన్నోసార్లు జట్టుకు విజయాలు అందించాడు.
కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా లాంటి ఎందరో అత్యుత్తమ క్రీడాకారులు.. ధోనీ కెప్టెన్సీలోనే అరంగ్రేటం చేసి ఈరోజు టీమిండియాకు వెన్నుముకలా నిలిచారు . 2007 టీ20 ప్రపంచకప్, 2011 ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇలా ఐసీసీ మూడు ట్రోఫీలను సొంతం చేసుకున్న ఏకైక కెప్టెన్‌గానూ మహీ నిలిచాడు. 444 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఔట్లు చేసిన వికెట్ కీపర్‌గానూ ప్రత్యేకత చాటుకున్నాడు.
పదహారేళ్లపాటు కెప్టెన్‌గా వికెట్ కీపర్‌గా, అన్నింటికీ మించి అద్భుతమైన వ్యూహకర్తగా ధోనీ సాధించిన విజయాలు అద్భుతం అనిర్వచనీయం. ఇతడు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడబోతున్న తొలి విదేశీ సిరీస్ ఇదే కావడం వల్ల తలా అందించిన అసమాన సేవలను కొనియాడుతూ బీసీసీఐ తన అధికార వెబ్సైట్లో మహేంద్రుడి ఫోటోలు పెట్టి... అతడి సేవలకు గుర్తింపు నిచ్చింది.
ఇవీ చదవండి:
- ధోనీ గురించి ఆసక్తికర విషయాలు.. మీకు తెలుసా?
- ధోనీతో పాటు నెం.7 జెర్సీ రిటైర్ కానుందా?
- దిగ్గజ ధోనీ నెలకొల్పిన 'తొలి' రికార్డులెన్నో
- ధోనీ.. నువ్వో కర్మ యోగి, క్రికెట్ విరాగి
- ధోనీ ఆ సమయానికే ఎందుకు రిటైర్ అయ్యాడు?
- ధోనీ.. మీరు ఎప్పటికీ నా కెప్టెనే: కోహ్లీ
- ధోనీ కెరీర్లో మరిచిపోలేని ఇన్నింగ్స్‌లు
- ధోనీ కెరీర్ ఎలా మొదలైందో అలానే ముగిసింది