భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ఆర్థికంగా వెనకబడిన 560 మంది గిరిజన ప్రాంత చిన్నారులకు అండగా నిలిచేందుకు ఓ ఎన్జీఓతో చేతులు కలిపారు. మధ్యప్రదేశ్ సెహోర్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సేవా కుటీరాలు ఏర్పాటు చేసిన ఎన్జీఓతో తెందూల్కర్ భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే సెవానియా, బీల్పతి, ఖాపా, నాయపురా, జముంజీల్ గ్రామాల పిల్లలు.. ఇకపై సచిన్ ఫౌండేషన్ ద్వారా సాయం పొందనున్నారు. వారికి పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్య అందించనున్నారు.
పిల్లల భవిష్యత్తు కోసం తెందూల్కర్ చేసిన కృషికి ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా ఉన్న సచిన్.. తరచూ చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలపై మాట్లాడుతూ ఉంటారు.
చిన్నారుల సంరక్షణ కోసం సచిన్ నిత్యం పాటుపడుతూనే ఉన్నారు. ఇటీవలే ముంబయిలోని ఎస్ఆర్సీసీ చిన్నారుల హాస్పిటల్లో ఆర్థికంగా వెనకబడిన పిల్లల చికిత్సకు అండగా నిలబడ్డారు. గతేడాది డిసెంబరులో ముంబయిలోని గాడ్గె మహారాజ్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు దివ్య ఫౌండేషన్ ద్వారా.. డిజిటల్ తరగతుల కోసం సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.