కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతోన్న టీమిండియా యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను వెనకేసుకొచ్చాడు ప్రధాన కోచ్ రవిశాస్త్రి. అతడో వరల్డ్‌క్లాస్ ప్లేయర్ అని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో రిషబ్‌కు జట్టు యాజమాన్యం పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పాడు.
"పంత్ వరల్డ్ క్లాస్ క్రికెటర్. మ్యాచ్‌లను గెలిపించగల సామర్థ్యం ఉంది. ఇలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. అతడు ఫామ్ అందుకునేందుకు కొంత కాలం వేచి చూడక తప్పదు. మీడియా, విశ్లేషకులు.. పంత్ గురించి వివిధ రకాలుగా రాస్తున్నారు. కానీ అతడికి జట్టులో కావాల్సినంత స్వతంత్రం ఉంది. అతడు నేర్చుకునే దశలో ఉన్నాడు. ఈ విషయంలో మేనేజ్మెంట్ పంత్‌కు అండగా ఉంటుంది". -రవిశాస్త్రి, టీమిండియా ప్రధాన కోచ్
ఇంతకుముందు పంత్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు కోచ్ రవిశాస్త్రి.
![team india coach ravi shastri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4559391_ravi-shastri.jpg)
"నేను వేరే విషయం గురించి మాట్లాడాను. అయితే పంత్ విధ్వంసక క్రికెటర్. అతడికి జట్టు నుంచి పూర్తి సహకారం అందిస్తున్నాం" -రవిశాస్త్రి, టీమిండియా ప్రధాన కోచ్
అంతకుముందు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. పంత్‌కు మద్దతుగా నిలిచాడు. అతడిపై కామెంట్లు చేయడం మానుకోవాలని, రిషబ్‌కు సహకారమందించాలని చెప్పాడు. అదేవిధంగా ధోనీ స్థానాన్ని భర్తీ చేసేందుకు పంత్ సరైనవాడని అన్నాడు.
"మహేంద్ర సింగ్ ధోనీ.. ఒక్క రోజులో ప్రముఖ ఆటగాడిగా మారిపోలేదు. అందుకు కొన్నేళ్ల సమయం పట్టింది. అతడిని భర్తీ చేసేందుకు కొంత కాలం పట్టొచ్చు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది. ఆలోపు పంత్ సిద్ధమవుతాడని ఆశిస్తున్నా" -యువరాజ్ సింగ్, భారత మాజీ క్రికెటర్
టీ20ల్లో ధోనీ రిటైర్మెంట్ తర్వాత అతడి స్థానాన్ని పంత్ భర్తీ చేస్తాడని అందరూ భావించారు. అయితే కొద్ది రోజులుగా ఒకేరీతిలో ఔటవుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడీ యువ ఆటగాడు. వీటన్నింటికీ పంత్ ఏ విధంగా సమధానమిస్తాడో చూడాలి.
ఇది చదవండి: ఒక్క అవకాశం ఇవ్వమని.. బతిమాలా: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్