ఆస్ట్రేలియా చేతిలో తొలి వన్డే ఓటమికి కారణం చెప్పుకొచ్చాడు భారత ఓపెనర్ శిఖర్ ధావన్. తొలి 10-15 ఓవర్లలో తాము చక్కగా ఆడామన్న ఈ స్టార్ బ్యాట్స్‌మన్.. స్వల్ప వ్యవధిలోనే నాలుగు వికెట్లు చేజార్చుకోవడం వల్లే ఆశించిన మేర పరుగులు రాబట్టలేకపోయినట్లు చెప్పాడు. ఇదే పరాజయానికి కారణమైందని అన్నాడు.
"తొలి 10-15 ఓవర్లు మేం బాగానే ఆడాం. ఎప్పుడైతే స్వల్ప వ్యవధిలో 4 వికెట్లు చేజార్చుకున్నామో అప్పుడే మ్యాచ్ మలుపు తిరిగింది. మేం ఆటలో వెనకబడ్డాం. దానిని సరిచేసేందుకు ప్రయత్నించినా పొరపాటు జరిగిపోయింది"
- శిఖర్ ధావన్, టీమిండియా క్రికెటర్
కోహ్లీ, రోహిత్, తనపై టీమిండియా అతిగా ఆధారపడుతోందా అన్న ప్రశ్నకు కూడా సమాధానమిచ్చాడు.
"చూడండి ఇదొక దుర్దినం అంతే. వెస్టిండీస్‌పై మేం చాలా బాగా ఆడాం. మా బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించారు. శ్రేయస్ యువకుడు.. బాగా ఆడుతున్నాడు. అప్పుడప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్‌లు తప్పవు. ఒక జట్టుగా మేం ఒకర్నొకరం ప్రోత్సహించుకుంటాం. ఏ ఒక్కరిపైనో ఎక్కువ దృష్టిపెట్టం. ఆధారపడం. ఆసీస్ బాగా ఆడింది. మాకు అదృష్టం కలిసిరాలేదు" అని ధావన్ జవాబిచ్చాడు.
ఎక్కడైనా ఓకే...
రోహిత్, ధావన్, రాహుల్‌ను గత మ్యాచ్‌లో ఎంపిక చేయడం వల్ల కోహ్లీ తన స్థానం త్యాగం చేశాడు. నాలుగులో బ్యాటింగ్‌కు దిగాడు. అయితే వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. తాజాగా తన బ్యాటింగ్ స్థానంపైనా మాట్లాడాడు గబ్బర్.
"కోహ్లీ నాలుగో స్థానంలో రావాలన్నది కెప్టెన్‌గా అతడి నిర్ణయం. రాహుల్ మంచి ప్రదర్శన చేశాడు. గత సిరీస్‌ల నుంచి ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. మూడో స్థానంలో మాత్రం విరాట్‌కు మంచి రికార్డు ఉంది. దీనిపై దృష్టి పెట్టి అదే స్థానంలో ఆడాలని కోరుకుంటున్నా. జట్టు అవసరం మేరకు ఏ స్థానంలో ఆడమన్నా నేను సిద్ధంగా ఉన్నా".
- ధావన్, టీమిండియా ఓపెనర్
వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. 256 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ అజేయ శతకాలతో చెలరేగారు. బుమ్రా, షమి, కుల్దీప్, శార్దూల్ ఒక్క వికెట్ తీయలేదు. తొలి వన్డేలో ధావన్(74), రాహుల్(47) మాత్రమే ఫర్వాలేదనిపించారు. రెండో వన్డే శుక్రవారం రాజ్‌కోట్‌లో జరగనుంది.