చెన్నై సూపర్‌కింగ్స్- సురేశ్ రైనా వివాదంలో మరో కొత్త విషయం వెలుగుచూసింది. దుబాయ్ నుంచి బయల్దేరగానే సీఎస్‌కే వాట్సాప్ గ్రూప్ నుంచి రైనాను తొలగించారని సమాచారం. ఆ తర్వాత అతడు జట్టు యాజమాన్యాన్ని కలిసి క్షమాపణలు కోరినట్టు తెలిసింది. తిరిగొచ్చేందుకు అవకాశం ఇవ్వాలనీ కోరాడని వార్తలు వస్తున్నాయి.
చెన్నై నుంచి దుబాయ్ చేరుకున్న సీఎస్‌కే జట్టు వారం రోజులపాటు క్వారంటైన్‌లో ఉంది. 1, 3, 6వ రోజు ఆటగాళ్లు, సిబ్బందికి ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు చేయించారు. పేసర్ దీపక్ చాహర్, బ్యాట్స్‌మన్ రుత్‌రాజ్ గైక్వాడ్ సహా 13 మందికి కొవిడ్-19 సోకింది. ఇదో పెద్ద సంచలనంగా మారింది. ఆ వెంటనే వ్యక్తిగత కారణాలతో సురేశ్ రైనా ఈ ఐపీఎల్‌కు పూర్తిగా దూరమవుతున్నాడని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ ప్రకటించారు. ఇది అంతకన్నా ఎక్కువ సంచలనమైంది.
ఎంఎస్ ధోనీ తరహాలో తనకూ బాల్కనీ ఉన్న సూట్‌రూమ్ ఇవ్వలేదని, బయో బుడగ నిబంధనలు అతిక్రమించాడని, ఆంక్షల విషయంలో రైనా ప్రవర్తన బాగా లేదని మొదట వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'విజయగర్వం తలకెక్కితే ఇలాగే ఉంటుంది. అతడు కోల్పోయే మొత్తం విలువేంటో తెలుసుకోవాలి' అని రైనాపై చెన్నై సూపర్‌కింగ్స్ యజమాని శ్రీనివాసన్ విరుచుకుపడ్డారు. ఆ తర్వాత మీడియా తన వ్యాఖ్యల కోణాన్ని మార్చేసిందని యూటర్న్ తీసుకున్నారు. ఆ మరుసటి రోజే రైనా మీడియాతో మాట్లాడాడు. 'శ్రీని నన్ను చిన్న కొడుకులా చూసుకున్నారు. వ్యక్తిగత, కుటుంబ కారణాలతోనే దుబాయ్ నుంచి వచ్చేశాను. తిరిగి ఐపీఎల్ ఆడేందుకు వెళ్లినా ఆశ్చర్యం లేదు' అని అన్నాడు.
శ్రీనివాసన్ విమర్శించి మళ్లీ ప్రశాంతంగా మాట్లాడిన రెండు సందర్భాల మధ్య చాలా కథే జరిగినట్టు తెలుస్తోంది. దుబాయ్ నుంచి బయల్దేరగానే సీఎస్‌కే వాట్సప్ గ్రూప్ నుంచి రైనాను తొలగించారట. దాంతో యజమాని శ్రీనివాసన్, జట్టు యాజమాన్యానికి అతడు క్షమాపణలు తెలియజేసినట్టు తెలిసింది. శ్రీని అతడి క్షమాపణను అంగీకరించారని అంటున్నారు. అయితే పునరాగమనం బాధ్యతను మాత్రం ధోనీ, విశ్వనాథన్‌పై పెట్టారు. ఇప్పటి వరకు రైనాకు ప్రత్యామ్నాయంగా ఎవరినీ ప్రకటించలేదు. ఉన్నవారితోనే నడిపించాలని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో తెలియదు.