దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలనుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆ దేశ ప్రభుత్వం నుంచి ఊహించని షాక్ తగిలింది. హోమగామాలో ఈ స్టేడియం నిర్మించాలన్న ప్రతిపాదనను పక్కన పెడుతున్నట్లు శ్రీలంక ప్రధాన మంత్రి రాజపక్సే తెలిపారు. గురువారం మాజీ క్రికెటర్లతో సమావేశమైన అనంతరం ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఐసీసీ మెగాటోర్నీల నిర్వహణకు కొత్త స్టేడియం నిర్మించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయించింది. 2023 నుంచి 2031 మధ్య ఐసీసీ ఈవెంట్‌లను నిర్వహించడం కోసం ప్రయత్నించాలని భావించిన బోర్డు.. 60 వేల మంది వీక్షించేలా కొత్త స్టేడియం నిర్మించాలనుకుంది.
ప్రైవేట్ పెట్టుబడులతో..
"ఈ నిర్మాణంలో పూర్తి ప్రైవేట్ పెట్టుబడి ఉంటుందని.. ఎలాంటి ప్రభుత్వ నిధులు ఉపయోగించబోమని" శ్రీలంక క్రికెట్ బోర్డు ఇటీవలే ప్రకటించింది. 2011 ప్రపంచకప్‌కు కొలంబోలోని ప్రేమదాస, హంబంతోట స్టేడియాలు మరమ్మతులు చేసిన తర్వాత బోర్డు అప్పుల్లో కూరుకుపోయింది. 2010లో మౌలిక సదుపాయల అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఆటగాళ్లకు వేతనాల్లో కోతలు విధించారు.
"ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న స్టేడియాలనే ఉపయోగించలేని క్రమంలో కొత్తది అవసరమా" అని ఇటీవలే మాజీ క్రికెటర్ జయవర్ధనే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఆలోచనను విరమించుకోవాలని ట్వీట్ ద్వారా తెలిపారు.
ఇదీ చూడండి.. 'ఇప్పుడున్నవి చాలదా.. కొత్తవి అవసరమా'