టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే దాదా.. ఈ అత్యున్నత పదవిని ఎలా నిర్వహిస్తాడనే విషయంపై సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. అసలు బీసీసీఐ అధ్యక్షుడికి ఎలాంటి అధికారాలు ఉంటాయి? భారత క్రికెట్లో అతడు ఎలాంటి పాత్ర పోషిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం.
- బీసీసీఐ విధులు, అధికారాల నిబంధనల ప్రకారం.. రాష్ట్ర క్రికెట్ సంఘాల అధ్యక్షులు, సభ్యులతో సమావేశాలు నిర్వహించాలి. బీసీసీఐ ఆర్థిక వ్యవహారాల వార్షిక ఖాతాలకు ఆడిటింగ్ నిర్వహించి సంతకాలు చేయాలి.
- భారత్ క్రికెట్ కోసం ప్రామాణిక విధానాలకు రూపకల్పన చేయాలి. వాటి అమలుకు కృషి చేయాలి. అవసరమైన ప్రణాళికలు, సూచనలు, నిబంధనలు, నియంత్రణలను రూపొందించాలి. జవాబుదారీతనం, పారదర్శకత, సమగ్రత లాంటి విలువలను భారత ఆటగాళ్లు, అభిమానుల్లో పెంపొందించాలి.
- భారత క్రికెట్ అభివృద్ధి కోసం అవసరమైన ప్రచారం కల్పించాలి. క్రియాశీలక మార్పులు చేపట్టాలి. ఆటగాళ్ల సంక్షేమం, ఆసక్తి మేరకు వారికి దోహదపడాలి. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.
- టోర్నీలు, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు, అంతర్జాతీయ టెస్టులు, వన్డేలు, టీ20లు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలి. కోచింగ్ అకాడమీలు ఏర్పాటు చేయాలి.
- క్రికెటర్లలో క్రీడాస్ఫూర్తి, వృత్తినిబద్దతను పెంపొందించి.. వాటి పరిరక్షణ కోసం పాటుపడాలి. పాలనను సమర్థమంతంగా నిర్వహించాలి. క్రికెటర్లు, జట్టు సభ్యులు, అంపైర్లు, పాలనాధికారులు తదితరులు పారదర్శకంగా ఉండేలా చూస్తూ.. వారు నైతిక విలువలను పాటించేలా కృషి చేయాలి.
- డోపింగ్, లైంగిక వేధింపులు, వయసు విషయంలో మోసాలు, వివక్ష, అన్యాయాలు లాంటి అంశాలను నిరోధించాలి.
- రాష్ట్ర, ప్రాంతీయ క్రికెట్ సంఘాలు, ఇతర ప్రైవేటు వ్యవస్థలు నిర్వహిస్తోన్న టోర్నీలు ప్రోత్సహించాలి. సభ్యులు, సంఘాల పనితీరులో ఏకరూపత సాధించడం కోసం నిబంధనలు తయారు చేయాలి.
- ఇతర దేశాల్లో పర్యటనలు, ఐసీసీ జట్లు మన దేశంలో పర్యటించడం, టోర్నీలకు ఆతిథ్యమివ్వడం లాంటివి ఎప్పటికప్పుడూ క్రమబద్దీకరిస్తూ ఉండాలి. వాటిని ఏర్పాటు చేయడమే కాకుండా నియంత్రించే అధికారమూ బీసీసీఐ అధ్యక్షుడికి ఉంది.
ఈ సారి బీసీసీఐ అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన ఏకకై వ్యక్తి గంగూలీ. నేడు జరిగే నామమాత్రపు ఎన్నికల్లో బీసీసీఐ అత్యున్నత పదవిని అతడు స్వీకరించడం లాంఛనమే. తను అధ్యక్షుడైన తర్వాత దేశవాళీ క్రికెటర్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఇప్పటికే చెప్పాడు దాదా. ముఖ్యంగా రంజీ క్రికెట్‌పై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నాడు. ఆర్థికంగా ఆటగాళ్లు ఇబ్బంది పడకుండా చూస్తానని అన్నాడు.