బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికై.. తక్కువ సమయంలో తన సమర్థతను చాటుకున్న సౌరభ్ గంగూలీ.. తొమ్మిది నెలల్లోనే పదవి నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. లోధా నిబంధనల ప్రకారం అతడి పదవీ కాలానికి సోమవారంతో తెరపడింది. గంగూలీనే కాదు.. అతడితో పాటే బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన జై షా సైతం పదవి నుంచి దిగిపోవాల్సిందే. బీసీసీఐ ఉపాధ్యక్షుడు మహిమ్ వర్మ నాలుగు నెలల కిందటే తన పదవికి రాజీనామా చేయగా.. బోర్డు సీఈవో రాహుల్ జోహ్రి, క్రికెట్ ఆపరేషన్స్ జీఏం సబా కరీమ్ ఇటీవలే పదవులకు టాటా చెప్పేశారు. దీంతో ఇప్పుడు బీసీసీఐ మరోసారి పాలన పరంగా సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి తలెత్తింది.
![Sourav Ganguly](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ganguly-1572531644_1207newsroom_1594526572_997.jpg)
ఎందుకిలా?:
ఐదేళ్లకు పైగా బెంగాల్ క్రికెట్ సంఘం పదవుల్లో ఉన్న గంగూలీ గత ఏడాది అక్టోబరులో బీసీసీఐ అధ్యక్షుడయ్యాడు. బోర్డు నిబంధనల ప్రకారం అతను తొమ్మిది నెలలే పదవిలో ఉంటాడన్నది అప్పుడే నిర్ణయం అయిపోయింది. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారణ అనంతరం.. బోర్డును గాడిలో పెట్టేందుకు సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ అమల్లోకి తెచ్చిన నిబంధనల ప్రకారం.. బీసీసీఐ లేదా దాని అనుబంధ క్రికెట్ సంఘాల్లో వరుసగా ఆరేళ్ల పాటు పదవిలో ఉన్న వ్యక్తి.. మూడేళ్ల తప్పనిసరి విరామం (కూలింగ్ పీరియడ్) తీసుకోవాలి. దీని ప్రకారం ఐదేళ్లకు పైగా బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) పదవుల్లో ఉన్న గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా తొమ్మిది నెలలకు మించి కొనసాగే అవకాశం లేకపోయింది. కార్యదర్శిగా జై షా పరిస్థితి కూడా సరిగ్గా అంతే.
![Ganguly with jai shah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1111133333333333_2207newsroom_1595422030_663.jpg)
సుప్రీం తీర్పుపై ఉత్కంఠ:
విరామ షరతుతో పాటు బోర్డు పాలనకు ఇబ్బందికరంగా మారిన లోధా కమిటీ నిబంధనలు కొన్నింటిని మార్చాలని గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ కార్యవర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విరామ నిబంధనను మార్చి తాము పూర్తిగా మూడేళ్ల పాటు పదవుల్లో కొనసాగేందుకు కోర్టు అనుమతిస్తుందని గంగూలీ, షా జోడీ ఆశించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం తమ పదవీ కాలం ముగిసేలోపే నిర్ణయం వస్తుందని భావించారు కానీ.. ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించలేదు. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కోర్టు ఈ పిటిషన్‌ను విచారించే వరకు గంగూలీ, షా తమ పదవుల్లో కొనసాగవచ్చని న్యాయ నిపుణులు కొందరంటుండగా.. మరికొందరు మాత్రం వాళ్లు మంగళవారం నుంచి బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందే అంటున్నారు. మరి సౌరభ్, జై ఏం చేస్తారో చూడాలి. స్పాట్ ఫిక్సింగ్ అనంతర పరిణామాల నేపథ్యంలో నాయకత్వ లేమితో బీసీసీఐ బాగా బలహీన పడింది. ఐసీసీలోనూ తన ఆధిపత్యాన్ని కోల్పోయింది. నిరుడు గంగూలీ బృందం నాయకత్వాన్ని చేపట్టడం వల్ల మళ్లీ పుంజుకుంది. ప్రపంచ క్రికెట్లో తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఐసీసీలోనూ ఆధిపత్యం దిశగా అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ మంచి కోసం గంగూలీ లాంటి సమర్థ పాలకుడు బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాలన్న విషయంలో అన్ని వర్గాల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది.మరి సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పును ప్రకటిస్తుందో చూడాలి.