బంగ్లాదేశ్ అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే నెల నుంచి జాతీయ క్రీడా సంస్థలో సాధన చేయనున్నాడు. ఐపీఎల్ సమయంలో ఫిక్సింగ్ చేయమంటూ తనను బుకీ సంప్రదించాడనే విషయాన్ని బయటపెట్టకపోవడం వల్ల నిరుడు అతనిపై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించింది. అయితే ఇప్పటికే ఒక ఏడాది శిక్షను తగ్గించగా.. నిషేధం ఈ ఏడాది అక్టోబర్ 29తో ముగుస్తుంది.
ఈ నేపథ్యంలో షకిబ్ తిరిగి మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించేందుకు ప్రాక్టీస్ ఆరంభించాలనుకుంటున్నట్లు అతడి మార్గనిర్దేశకుడు నజ్మల్ అబెదీన్ తెలిపాడు.
"వచ్చే నెలలో షకీబ్ జాతీయ క్రీడా సంస్థకు వస్తాడు. అక్కడ కోచ్‌లు, శిక్షకులు అతనికి అందుబాటులో ఉంటారు. అతను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధన చేసుకోవడం కోసం ఆ ప్రాంగణంలోనే కోచ్‌లు ఉండేందుకు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం కుటుంబంతో కలిసి యుఎస్‌లో ఉన్న అతను ఈ నెల చివర్లో బంగ్లాదేశ్ చేరుకోనున్నాడు" అని జాతీయ క్రీడా సంస్థ క్రికెట్ సలహాదారుడు కూడా అయిన నజ్మల్ పేర్కొన్నాడు.
గతేడాది వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో షకిబ్ 606 పరుగులు చేశాడు. అతను ఇప్పటివరకూ బంగ్లా తరపున 56 టెస్టులు, 206 వన్డేలు, 76 టీ20లు ఆడాడు.