టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీపై ప్రశంసలు కురిపించాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. సెలెక్టర్లు తనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. దాదా మద్దతుగా నిలిచేవాడని పేర్కొన్నాడు. ఇటీవలే ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన భజ్జీ పలు విషయాలపై స్పందించాడు.
"ఒకానొక సమయంలో నాతో ఎవరు ఉన్నారో, ఎవరు లేరో తెలుసుకోలేని స్థితిలో ఉన్నా. ఎవ్వరూ నాకు మద్దతుగా లేనప్పుడు నాకోసం గంగూలీ నిలబడ్డాడు. సెలెక్టర్లు నాకు వ్యతిరేకంగా ఉండేవారు. బయటికి చెప్పుకోలేని విధంగా నా ముఖం మీద మాట్లాడేవారు. అసలు గంగూలీని ఎంత ప్రశంసించినా తక్కువే. ఆ సమయంలో దాదా కెప్టెన్ కాకపోయుంటే వేరే ఎవ్వరైనా నాకు అంతలా మద్దతు ఇచ్చేవారు కాదు."
-హర్భజన్ సింగ్, భారత బౌలర్
బౌలింగ్ సమయంలో ప్రధానంగా ఫీల్డింగ్ సెట్ చేసేందుకు గంగూలీ తనకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చేవాడని హర్బజన్ తెలిపాడు. గంగూలీ, ధోనీ, రోహిత్ శర్మ వంటి కెప్టెన్ల నేతృత్వంలో ఆడిన భజ్జీ.. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు సాధించిన రెండవ వ్యక్తిగా గుర్తింపు సాధించాడు.