టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్‌పై ప్రశంసలు కురిపించాడు మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. వీరూ గొప్ప నిజాయతీపరుడని, అదే అతడి బలమని అభిప్రాయపడ్డాడు. గౌరవ్‌కపూర్ అనే వ్యాఖ్యాతతో 22 యార్డ్స్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ..సెహ్వాగ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వీరూ ఏం చేయగలడో, ఏం చేయలేడో అనే విషయాలపై చాలా స్పష్టంగా ఉంటాడని చెప్పాడు ఆకాశ్. అలాగే టెస్టుల్లో 8 వేలకు పైగా పరుగులు చేసినా అతనెప్పుడూ బౌన్సర్ బంతిని ఆడలేదని.. అతడి నిబద్ధత, క్రమశిక్షణ అలాంటివని వ్యాఖ్యానించాడు.
తామిద్దరం కలిసి ఆడేటప్పుడు సెహ్వాగ్ ఎన్నో విషయాలు పంచుకునేవాడని, ఒకవేళ బంతి మరీ ఎక్కువ స్వింగ్ అవుతుంటే తాను షాట్లు ఆడలేనని చెప్పేవాడని మాజీ టెస్టు బ్యాట్స్‌మన్ పేర్కొన్నాడు. ఆ విధంగా తన బలాలు, బలహీనతలపై పూర్తి అవగాహనతో ఉండేవాడన్నాడు. బంతి స్వింగ్ అవుతుంటే ఆడటం ప్రమాదకరమని భావించి కొన్ని ఓవర్ల పాటు పరుగులు చేయకుండా అలాగే క్రీజులో ఉందామని చెప్పేవాడని అన్నాడు. తర్వాత అవకాశం దొరికినప్పుడు చితక్కొట్టొచ్చనే నమ్మకంతో సెహ్వాగ్ ఉండేవాడని చోప్రా తన అనుభవాలను గుర్తుచేసుకున్నాడు. అలాగే తాను ఆడేటప్పుడు బ్యాటింగ్‌లో కుదురుకున్నాక ఔటవ్వడం చూసి.. అలా తరచూ ఔటైతే జట్టులోంచి తీసేస్తారని సెహ్వాగ్ సలహా ఇచ్చినట్లు ఆకాశ్ పేర్కొన్నాడు.
ఆకాశ్ చోప్రా టీమ్‌ఇండియా తరఫున 10 టెస్టులే ఆడగా 437 పరుగులు చేశాడు. అందులో రెండే అర్ధశతకాలు నమోదుచేశాడు. దాంతో అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. మరోవైపు దేశవాళి క్రికెట్‌లో మాత్రం అద్భుతమైన బ్యాట్స్‌మన్‌గా రాణించాడు. ఇక ఐపీఎల్ ఆరంభంలో రెండు సీజన్లలో కలిపి కేవలం ఏడు మ్యాచ్‌లే ఆడాడు. అక్కడ కూడా విఫలమయ్యాక క్రికెట్ వ్యాఖ్యాతగా మారాడు. ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ క్రికెట్‌పై తన అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నాడు.
ఇది చూడండి ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ షెడ్యూల్ ఇదే