వన్డే క్రికెట్ అనగానే బంతికో పరుగు చొప్పున చేస్తే చాలన్నట్లుగా ఉండేది. కానీ చాలాకాలం క్రితమే దీనిని చెరిపేశాడు శ్రీలంక బ్యాట్స్‌మెన్ సనత్ జయసూర్య. బంతికో పరుగు కాదు, రెండు పరుగులు రాబట్టి... వన్డేల్లోని బ్యాటింగ్‌లో మార్పునకు ఓ విధంగా కారణమయ్యాడు. అలాంటి విధ్వంసక ఇన్నింగ్స్‌కు నేటికి సరిగ్గా 24 ఏళ్లు.
1996 ఏప్రిల్ 2న పాకిస్థాన్‌తో సింగర్ కప్ ఆడింది శ్రీలంక. సింగపూర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో వీరవిహారం చేసిన జయసూర్య.. 48 బంతుల్లోనే శతకం చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. మొత్తంగా 65 బంతుల్లో 134 పరుగులు చేసి, జట్టు స్కోరు 349/9 చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
అనంతరం ఛేదనలో పాక్.. 34 పరుగుల తేడాతో ఓడింది. అయితే ఈ మ్యాచ్‌లో బీభత్సమైన బ్యాటింగ్ చేసిన సనత్.. అప్పట్లోనే పలు రికార్డులు నెలకొల్పాడు.
జయసూర్య నెలకొల్పిన రికార్డులు:
- అతి తక్కువ(48) బంతుల్లోనే శతకం(206.5 స్ట్రైక్‌రేట్‌తో) చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు.
- ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులతో(11) సరికొత్త రికార్డు. గతంలో ఈ ఘనత గోర్డాన్ గ్రీనిడ్జ్(8) పేరిట ఉండేది.
- భారీ లక్ష్యాన్ని పూర్తి చేసే క్రమంలో పాక్... 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓ వన్డేలో అత్యధిక పరుగులు నమోదవడం ఇదే తొలిసారి.
ఇదీ చదవండి: టీమిండియా 28 ఏళ్ల కల నెరవేరిన ఆ క్షణం