టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్ సచిన్ తెందూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ ఎంత గొప్ప ఆటగాళ్లో అందరికీ తెలిసిందే. ఆ ఇద్దరూ పాకిస్థాన్ జట్టును పలుమార్లు ఊచకోత కోశారు. తమదైన బ్యాటింగ్‌తో చిరకాల ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టారు. సచిన్ 1999లో చెన్నై టెస్టులో శతకంతో చెలరేగిపోగా.. వీరూ 2004లో ముల్తాన్‌లో త్రిశతకం బాదాడు. ఆ రెండు ఇన్నింగ్స్ భారత అభిమానులకు ఎంతో ప్రత్యేకం. అయితే, విధ్వంసకర బ్యాట్స్‌మన్ సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ కన్నా లిటిల్ మాస్టర్ 136 పరుగులే తన దృష్టిలో గొప్ప ఇన్నింగ్స్ అని పాక్ మాజీ ఆటగాడు సక్లెయిన్ ముస్తాక్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన అతడు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌పై స్పందించాడు.
"ముల్తాన్‌లో సెహ్వాగ్ త్రిశతకం కన్నా 1999లో చెన్నై టెస్టు సందర్భంగా రెండో ఇన్నింగ్స్‌లో సచిన్ చేసిన 136 పరుగులే నా దృష్టిలో ఎక్కువ. ఎందుకంటే అప్పుడు మేం పూర్తిస్థాయిలో సన్నద్ధమై వెళ్లాం. అప్పుడు టెస్టు సిరీస్ ఒక యుద్ధంలా జరిగింది. ఇక 2004లో ముల్తాన్‌లో అసలు పోటీయే లేదు. అది కూడా వీరూ ఆడింది రెండో ఇన్నింగ్స్‌లో కాదు తొలి ఇన్నింగ్స్‌లో. తొలిరోజు పిచ్ బ్యాట్స్‌మన్‌కు సహకరించింది. ఇంకా మేము ఆ టెస్టుకు సన్నద్ధం కూడా అవ్వలేదు. సెహ్వాగ్ ముల్తాన్‌లో చెలరేగిపోయాడు. ఆరోజు ప్రకృతి సహకరించింది. అయితే, వీరూ మంచి ఆటగాడు కాదని నేను అనట్లేదు. అతడో గొప్ప ఆటగాడు. అయితే, ఆ రోజు వికెట్ చాలా ఫ్లాట్‌గా ఉండింది. బౌలర్లకు ఆ పరిస్థితులు చాలా కష్టంగా మారిపోయాయి. దాంతో బౌలింగ్ విభాగం మొత్తం విఫలమైంది"
- సక్లెయిన్ ముస్తాక్, పాక్ మాజీ క్రికెటర్
సెహ్వాగ్‌కు ప్రకృతి దయ..!
2004లో పాకిస్థాన్ జట్టు సరిగ్గా సన్నద్ధమవ్వలేదని, అలాగే తమ జట్టులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని చెప్పాడు. అనూహ్యంగా ఇంజమామ్ కెప్టెన్ అయ్యాడని, అలాంటి నేపథ్యంలో టీమ్‌ఇండియాతో టెస్టు సిరీస్ అంటే పూర్తి స్థాయిలో సన్నద్ధమవ్వలేదన్నాడు. సెహ్వాగ్ ఎంత విధ్వంసకర బ్యాట్స్‌మన్ అయినా ఆ ట్రిపుల్ సెంచరీని మాత్రం తాను అంగీకరించనన్నాడు. ప్రకృతే అతడిని అన్ని పరుగులు చేసేలా చేసిందన్నాడు. ఎవరైనా పూర్తిస్థాయిలో సన్నద్ధమైనప్పుడు, తమ బౌలింగ్ విభాగంతో పాటు అందరు ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తున్నప్పుడే ఆటను ఆస్వాదించగలమని సక్లెయిన్ వివరించాడు.
ఈ పాక్ ఆటగాడు 1999 చెన్నై టెస్టుతో పాటు 2004 ముల్తాన్ టెస్టులోనూ ఆడాడు. దీంతో ఆ రెండు మ్యాచ్‌ల పరిస్థితులను పోల్చిచూసి సచిన్ బ్యాటింగ్‌ను మెచ్చుకున్నాడు.